సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం బ్రహ్మోత్సవం చూసిన అనంతరం కాంట్రవర్సీ కింగ్, డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ మహేష్ కు కొన్ని సూచనలు చేశారు. నేరుగా కాదు. ట్వీట్ల ద్వారానే తన అభిప్రాయాలను చెప్పారు. సెటైర్లు కూడా వేశారు.
“సావియన్ గ్లోవర్, మార్త గ్రహమ్, జార్జ్ వంటి ప్రపంచం మెచ్చిన కొరియోగ్రాఫర్లు బాలా త్రిపురమని పాటలో మహేష్ వేసిన స్టెప్ చూసి ఎంతో నేర్చుకోవాలి” అని వర్మ సెటైర్ వేశారు.
“ఫ్యామిలీ చిత్రాలను చూసేందుకు వచ్చిన కుటుంబంలోని తండ్రి సినిమాలోని హీరోయిన్ అందాలను చూస్తాడు. తల్లి చీరలను చూస్తుంది. కూతురు తన బాయ్ ఫ్రెండ్ కి మెసేజ్ పెడుతుంటుంది. కొడుకు నిద్ర పోతాడు. ఈ విషయాన్నిమహేష్ గ్రహించాలి.” అని సలహా ఇచ్చారు.
“ఫ్యామిలీ చిత్రాలు అనేవి ఎంట్రీ, ఎగ్జిట్ గా మాత్రమే పెట్టుకోవాలి. ఒకసారి ఆడియన్స్ సీట్లో కూర్చున్న తర్వాత పోకిరి, ఒక్కడు, బిజినెస్ మాన్ వంటి సినిమాలు చూడాలని కోరుకుంటాడు.” అని చెప్పారు.
“మహేష్ ముందు నీ సూపర్ స్టార్ డమ్ ను నువ్వు అర్ధం చేసుకోవాలి. అది సాధారణ ఫ్యామిలీ కంటే ఎన్నో ఎత్తులో ఉన్న సంగతిని మరిచిపోకుండా సినిమాలు తీయమని” హిత బోధ చేశారు.
ఈ కామెంట్ల పై మహేష్ అభిమానుల నుంచి ఎటువంటి ఎదురు దాడి జరగలేదు. దీంతో మరుసటి రోజు “మహేష్ అభిమానులు నా కామెంట్లను పాజిటివ్ గా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అని రామ్ గోపాల్ వర్మ ట్వీటారు.