వర్మ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో “రంగీలా” ఒకటి. ఊర్మిళ టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో మాత్రమే కాక తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకి ట్రిబ్యూట్ గా తెరకెక్కిన చిత్రం “బ్యూటిఫుల్”. నైనా గంగూలీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వర్మ నిర్మించగా.. అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించిందో లేదో చూద్దాం..!!
కథ: రిని (నైనా గంగూలీ), మాయాంక్ (పార్థ్ సూరి) ముంబైలోని ధారావిలో ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ.. పనికంటే ఎక్కువగా బీచ్ లో ప్రేమించుకుంటూ.. తిరుగుతూ, బ్రతుకుతుంటారు. ఉన్నట్లుంది రిని అందాలకు సినిమా అవకాశం వస్తుంది. ఆరబోతకు అడ్డు చెప్పకపోవడంతో అగ్ర కథానాయికగా మారుతుంది. అప్పటివరకూ ఆనందంగా సాగిపోయిన ప్రేమకథలోకి మేనేజర్ దూరతాడు.
ఆ తర్వాత రిని-మాయాంక్ ల ప్రేమ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఏం జరిగింది? అనేది “బ్యూటీఫుల్” సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు: నైనా గంగూలీ నటించడం కంటే అందాల ఆరబోయడానికే ఎక్కువ ఇష్టపడింది. సూరి పర్వాలేదనిపించుకున్నాడు. వీళ్ళిద్దరు కాకుండా సినిమాలో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ.. ఎవరు పెద్దగా గుర్తుండరు. అందువల్ల వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు.
సాంకేతికవర్గం పనితీరు: ఇండియన్ ఫిలిమ్ హిస్టరీలో అద్భుతమైన చిత్రాలను మాత్రమే కాదు తన చిత్రాలను తానే చేదగొట్టుకోవాలన్నా తానే తోపు అని నిరూపించాడు ఆర్జీవీ. ఆమధ్య “షోలే” చిత్రానికి సీక్వెల్ గా “ఆర్జివి కి ఆగ్” అనే చిత్రాన్ని తీసి థియేటర్లకి వచ్చిన ఆడియన్స్ తో బంతాట ఆడుకున్న ఆర్జీవి.. ఇప్పుడు “రంగీలా” చిత్రానికి ట్రిబ్యూట్ అంటూ రూపొందించిన “బ్యూటీఫుల్”తోనూ అదే పని చేశాడు. అందువల్ల.. ప్రేక్షకులు కొత్తగా మోసపోయేది ఏమీ లేకపోయినా.. వర్మ ఎందుకు ఇలా అయిపోతున్నాడో అని మరోసారి బాధపడతారు.
దర్శకుడు అగస్త్య మంజు హ్యాండిల్ చేసిన కెమెరా, కథ రెండు అడ్డదిడ్డంగా అమ్మాయి చుట్టూ తిరిగాయి కానీ.. ఒక కథ-కథనం అనేది మాత్రం కనిపించలేదు. అందువల్ల.. సినిమా చూస్తున్నంతసేపు “ఈ హీరోయిన్ కి డెమో వీడియో తీయాలంటే యూట్యూబ్ లో రిలీజ్ చేయాలి కానీ.. ఇలా థియేటర్లలో రిలీజ్ చేసి మా ప్రాణాలు ఎందుకు తీయడం” అని తిట్టుకుంటూ ఉంటారు ఆడియన్స్. బెంగాలీ అడల్ట్ వెబ్ సిరీస్ “ఆశ్చర్యచకిత్” ద్వారా ఆల్రెడీ తన అందాలను ఇంటర్నెట్ లో ఆరబోసిన నైనా గంగూలీ అందాలను ఇంకాస్త పెద్ద తెరపై చూపించారే కానీ.. ఆమెలోని నటిని కానీ.. ఆమెను కానీ సరికొత్తగా ప్రెజంట్ చేయలేకపోయారు.
విశ్లేషణ: ప్రీరిలీజ్ ఈవెంట్ మరియు ప్రమోషన్స్ లో వర్మ వేసిన వోడ్కా చిందుల్లాగే.. “బ్యూటీఫుల్” సినిమా కూడా పిచ్చిపిచ్చిగా ఉంటుంది. సొ, నైనా గంగూలీ అందాల ఆరబోతను ఎంజాయ్ చేయగలిగే అత్యాశ ఉంటే మాత్రమే ఈ సినిమా థియేటర్ కి వెళ్ళండి.