కొన్ని టీషాపుల దగ్గర “అప్పు రేపు” అని బోర్డ్ పెట్టి ఉంటుంది. అంటే ఎప్పటికీ అప్పు ఇవ్వబోమని చెప్పలేక ఎప్పుడు ఎవరు వచ్చి అడిగినా “అప్పు రేపు” అని ఇండైరెక్ట్ మేసేజ్ లా ఉంటుంది. ఇప్పుడు వర్మ ట్విట్టర్ చూసినా అదే భావన కలుగుతోంది. ఆయన సమర్పణలో తెరకెక్కిన తాజా చిత్రం “భైరవ గీత” నిజానికి నవంబర్ 23న విడుదలకావాల్సి ఉండగా.. వర్మ అతితెలివి కారణంగా అనవసరంగా నవంబర్ 30కి పోస్ట్ పోన్ అయ్యింది. మళ్ళీ ఏమనుకున్నాడో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7కి పోస్ట్ పోన్ చేశాడు.
ఒకే మొత్తానికి అప్పటికైనా రిలీజ్ అవుతుంది అనుకొంటున్న తరుణంలో మళ్ళీ “భైరవగీత”ను డిసెంబర్ 14కి వాయిదా వేశాడు వర్మ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం కన్నడలో ఈ శుక్రవారం అనగా డిసెంబర్ 7న విడుదలవుతుండగా.. తెలుగులో మాత్రం డిసెంబర్ 14న విడుదల అని ప్రకటించాడు వర్మ. అదేదో బ్రహ్మోత్సవం తరహాలో ఒక వారం అక్కడ, ఇంకో వారం ఇక్కడ ఈ వారోత్సవాలేమిటి వర్మ గారూ. అయినా.. సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ ఎప్పుడొచ్చినా హిట్ అవ్వుద్ది.