రామ్ గోపాల్ వర్మ, మళ్లీ తేనె తుట్టను కదిలిస్తున్నాడా? గతంలో జరిగిన మారణకాండకు మళ్లీ ప్రాణం పోస్తున్నాడా? అంటే అవును అనే అంటున్నాయి, సినిమా వర్గాలు, బెజవాడ సెంటర్లు. అసలు వర్మ ఆలోచన ఏంటంటే…తాను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా బెజవాడలోనే, పైగా తాను అప్పట్లు సిద్దార్ధ కాలేజీలో చదువుకున్న రోజుల్లో జరిగిన ఘర్షణలు, దాని పర్యావసానాలను చూపించే ప్రయత్నంలో ఉన్నాడని చెబుతున్నాడు. చలసాని వెంకట రత్నాన్ని వంగవీటి రాధ ఎలా ఎదుర్కున్నాడు, వెంకటరత్నం ఎలా హత్య చేయబడ్డాడు, ఇక ఆ తరువాత, రాధ హత్య, ఎన్టీఆర్ ప్రవేశం, రంగా- ఎన్టీఆర్ మధ్య జరిగిన విషయాలు, రంగా హత్య ఇలా అన్నీ కలగలిపి తెరపైకి ఎక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు వర్మ. అంతేకాకుండా ఆ సన్నివేశాలని, కళ్ళకు కట్టినట్లుగా చూపించాలని, 30ఏళ్ల క్రిందటి బెజవాడను అందరికి చూపించే ప్రయత్నంలో భాగంగా ఖర్చుకి ఎక్కడా వెనకాడవద్దు అని నిర్మాత తెలిపినట్లు సైతం వర్మ చెబుతున్నాడు. ఇక మరో పక్క ఆ రౌడీ చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిన కొన్ని కుటుంబాలు ఇప్పుడు ఈ సినిమాపై కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చరిత్రను చరిత్రగా తియ్యాలి కానీ, ఎక్కడైనా వక్రీకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని వంగవీటి రాధ హెచ్చరించారు. ఇక మరో పక్క ‘కమ్మ-కాపు’ అనే పాత సైతం అనేక విమర్శలకు దారితీస్తుంది. మరి ఈ విషయాలన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని వర్మ, ఎలాంటి సినిమాను ప్రజల్లోకి తీసుకొస్తాడో చూద్దాం.