రైట్ రైట్

బడా నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు సుమంత్ అశ్విన్. కాని తను నటించిన మొదటి సినిమాకే ఫ్లాప్ టాక్ రావడంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. కొంత గ్యాప్ తీసుకొని మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘అంతకముందు ఆ తరువాత’ అనే సినిమాలో నటించి హిట్ అందుకున్నాడు. ఆ తరువాత లవర్స్, చక్కిలిగింత, కొలంబస్ ఇలా చాలా చిత్రాల్లో నటించాడు. కాని పెద్దగా బ్రేక్ రాలేదు. కేరింత సినిమా మాత్రం ఈ హీరోకు కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఈ హీరో నటించిన ‘రైట్ రైట్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడు మను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అయిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..!

కథ: వైజాగ్ లోని ఎస్.కోట అనే ప్రాంతం నుండి గవిటికి వెళ్ళే బస్సుకు సుమంత్ అశ్విన్ కండక్టర్ గా కాలకేయ ప్రభాకర్ డ్రైవర్ గా పని చేస్తుంటారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఇద్దరు తమ జీవితాలను లీడ్ చేస్తుంటారు. పూజా జవేరి ఓ టీచర్. రోజు ఆ బస్సులో ప్రయాణం చేస్తుంటుంది. దీంతో సుమంత్, పూజ ల మధ్య స్నేహం కుదురుతుంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. ఇది ఇలా ఉండగా.. వూరి పెద్ద అయిన నాజర్ ఓ అమ్మాయిని పెంచుకుంటాడు. ఆ అమ్మాయిని తన దగ్గర పని చేసే ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. కాని ఆ అమ్మాయిని వేరే వ్యక్తి కూడా ప్రేమిస్తాడు. ఇలా రెండు కథలు నడుస్తుండగా.. ఒకరోజు సుమంత్ అశ్విన్ బస్సు నడుపుతుండగా ఓ వ్యక్తి ఆ బస్సు కింద పడి చనిపోతాడు. దీంతో వీరి జీవితాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాయి. ఇంతకీ బస్సు కింద పడిన వ్యక్తి ఎవరు..? ఆ కేసు నుండి సుమంత్ తప్పించుకున్నాడా..? లేదా..? తన ప్రేమను గెలిపించుకున్నాడా..? అనే అంశాలతో సినిమా రన్ అవుతుంది.

నటీనటుల పెర్ఫార్మన్స్: ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పుకునేది సుమంత్ అశ్విన్ నటన. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో తన నటనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కండక్టర్ పాత్రలో సహజంగా నటించడానికి మంచి ప్రయత్నమే చేశాడు. కాలకేయ ప్రభాకర్ ఇప్పటివరకు చేయని ఓ పాజిటివ్ రోల్ లో నటించాడు. తనకు ఇలాంటి పాత్రలు కొత్తవే అయినా.. వీలైనంత ప్రేక్షకులను మెప్పించే విధంగా నటించాడు. హీరోయిన్ పూజా జవేరి పాత్ర గురించి గానీ, నటన గురించి గానీ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ప్రజలు గౌరవించే వూరి పెద్దగా నాజర్ సహజ నటనను కనబరిచారు. తాగుబోతు రమేష్, షకలక శంకర్, ధనరాజ్ ఇలా ఎంతమంది కమెడియన్స్ ఉన్నా సినిమాలో నవ్వించే సన్నివేశాలు మాత్రం లేవు. అక్కడక్కడా షకలక శంకర్ కాస్త నవ్వించాడు. వినోద్, జీవా, భరత్ రెడ్డి, సుధా, జయవాణి వారి పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు: ఈ సినిమాకు పెద్ద మైనస్ మ్యూజిక్ అనే చెప్పాలి. సందర్భానుసరంగా లేని పాటలు, ఆకట్టుకోలేని నేపధ్య సంగీతం సినిమాను తేల్చేసాయి. ఫోటోగ్రఫీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మంచి లోకేషన్స్ ను మనం తెరపై చూడొచ్చు. దర్శకుడు మను ఇది వరకు కో డైరెక్టర్ గా పెద్ద పెద్ద సినిమాలకే పని చేశాడు. అయితే డైరెక్టర్ గా తను ఎంచుకున్న కథలో బలం లేదు. ఇరవై నిమిషాల్లో చెప్పే కథను రెండు గంటలు సాగదీసి ప్రేక్షకులకు విసుగు తెప్పించే విధంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. దీనికి తగ్గట్లు ఎడిటింగ్ కూడా అలానే ఉంటుంది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే.. సినిమా బావుండేదేమో.. ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెట్టి సినిమా తీశారో.. దానికి కనీస వసూళ్లు కూడా వస్తాయో.. రావో..?

విశ్లేషణ: కొన్ని సినిమాలను రీమేక్ చేయాలనుకోవడం పొరపాటు. ఒక బాషలో హిట్ అయింది కదా.. మరొక బాషలో కూడా హిట్ అవుతుందనుకోవడం తప్పు. ఇలా రీమేక్ చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ టాక్ నే తెచ్చుకున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన కథను తెలుగుకు తగ్గట్లు కొన్ని మార్పులు చేసి ప్రేక్షకులకు అందించారు. అయితే అక్కడ కథలకు మనకు చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనవాళ్ళకు కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ కావాల్సిందే. రైట్ రైట్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని కాదు కానీ.. డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త తీసుకుంటే ప్రేక్షకులకు సినిమా నచ్చేది. కాని తన సాగతీతతో అసహనానికి గురి చేశాడు. కథలో కొత్తదనం లేకపోవడం.. ఈ సీన్ ఇంతకముందు వేరే సినిమాలో చూసామే అనే ఫీలింగ్ కలిగించడం వలన ‘రైట్ రైట్’ బాక్సాఫీస్ దగ్గర నడవడం కష్టమే..!

ట్యాగ్ లైన్: రైట్.. రైట్ ఇది చాలా స్లో..

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus