సామాన్యులకి మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా భద్రత లేకుండా పోతుంది. కొన్నాళ్లుగా గుర్తు తెలియని వ్యక్తులు సెలబ్రిటీలను ముఖ్యంగా సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొన్నామధ్య మోహన్ బాబు (Mohan Babu) ఇంట్లో కొంతమంది దుండగులు కారులో దూసుకొచ్చి.. అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. తర్వాత కొంతమంది దొంగలు సినిమా వాళ్ళ ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్న కేసులు కూడా మనం చూశాం. ఖరీదైన వస్తువులు లేక డబ్బు వంటివి వాళ్ళు దోచుకుంటున్నారు.
తాజాగా ఓ టాలీవుడ్ హీరో ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు తెలుస్తుంది. ఆ హీరో మరెవరో కాదు విశ్వక్ సేన్ (Vishwak Sen) . అవును విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ జరిగిందట. ఫిలింనగర్లో ఉన్న విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం నాడు తెల్లవారు జామున ఈ దొంగతనం జరిగినట్టు సమాచారం. దీంతో విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారట. ఫిర్యాదులో భాగంగా.. రూ.2 లక్షల విలువైన డైమండ్ రింగ్ అపహరణ జరిగినట్టు ఆయన పేర్కొన్నారట.
అతని కంప్లైంట్ ను టేకప్ చేసిన పోలీసులు.. వెంటనే దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టమవుతుంది. ముందుగా ఇంట్లోకి కొత్తగా ఎవరు వచ్చారు? ఎవరు వెళ్లారు? అనే విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని చెక్ చేయగా.. వీరి ఇంటి బయట గుర్తు తెలియని ఓ వ్యక్తి బైక్ పై అనుమానాస్పదంగా కనిపించినట్టు గుర్తించారు. అతనే చోరీ చేసి ఉండొచ్చు అనేది వారి అనుమానం. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.