తెలుగు చిత్రాల స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఇందులో స్వీటీ అనుష్క దేవసేన పాత్రలో డీ గ్లామరస్ గా కనిపించింది. ఆమె అభిమానులు కొంత నిరాశ పడ్డారు. అయితే బాహుబలి కంక్లూజన్ లో ఆమె అందంగా కనిపిస్తుందని, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రొమాన్స్ చేస్తుందని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చెప్పడంతో శాంతించారు. నిన్నటి నుంచి డైరక్టర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో ఉన్నారు.రామోజీ ఫిలిం సిటీ లో వేసిన స్పెషల్ సెట్ లో బాహుబలి, దేవసేన పై ప్రేమ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.
సైజ్ జీరో చిత్రం కోసం బరువు పెరిగిన జేజేమ్మ బరువు తగ్గడానికి నానా తంటాలు పడింది. మొహానికి ముసుగు వేసుకుని హైదరాబాద్ రోడ్లపైన సైకిల్ తొక్కింది. రెండు నెలలు కష్టపడి స్లిమ్ అయి షూటింగ్ కి హాజరైంది. తొలి రోజు (బుధ వారం) ప్రభాస్, అనుష్క లపై పాటకు ముందు వచ్చే లీడ్ సీన్ ను చిత్రీకరించారు. గురువారం పాట షూటింగ్ మొదలయింది. బాహుబలి 1 లో “పచ్చ బొట్టేసి” సాంగ్ ని మరిపించే రీతిలో బాహుబలి 2 కోసం సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి రొమాంటిక్ సాంగ్ కంపోజ్ చేశారని, ఈ పాటకు డార్లింగ్, స్వీటీ లు కలిసి మరింత అందాన్ని తీసుకు వసున్నారని సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ మరో ఐదు రోజుల పాటు సాగనుంది.