బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు (Saif Ali Khan) మరో నటుడి టీమ్ సెక్యూరిటీ ఇస్తోంది. ఇటీవల దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను వేకువజామన ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో ఆయన కోలుకొని ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సైఫ్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన సెక్యూరిటీ బాధ్యతను బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ (Ronit Roy) తీసుకున్నారు. ఈ మేరకు సైఫ్‌ను ఆయన మంగళవారం వచ్చి కలిశారు.
ముంబయిలో రోనిత్ రాయ్ ఓ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్‌ను కలిసొచ్చాక రోనిత్ రాయ్ మాట్లాడుతూ ‘మేం సైఫ్‌తోనే ఉన్నాం. ఆయన ఆరోగ్యం మెరుగుపడింది’ అని చెప్పారు. అయితే ఎటువంటి సెక్యూరిటీ అందిస్తున్నారు, పోలీసుల సహకారంతో ఈ సెక్యూరిటీ ఉంటుందా? లేక పూర్తిగా ప్రైవేటు సెక్యూరిటీ స్టైల్‌లో నిర్వహిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం ఆయన దగ్గర ప్రస్తావించగా సమాధానం దాటవేశారు.
ఈ నెల 16న తెల్లవారుజామున సైఫ్ ఇంట్లోకి ఓ దుండగుగు చొరబడి చోరీకి ప్రయత్నించాడు. ఆ సమయంలో సైఫ్ చిన్న కుమారుడి మెయిడ్ చూసి అలెర్ట్ చేసింది. దీంతో అతనిని అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. వెన్నెముకకు తీవ్రగాయం కావడంతో సర్జరీ కూడా చేశారు. వారం పాటు బెడ్‌రెస్ట్ సజెస్ట్ చేశారు. ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేందుకు బయట వ్యక్తులకు దూరంగా ఉండాలని కూడా సూచించారు.
ఇక సైఫ్‌పై దాడి కేసులో నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ పోలీసుల ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. అతను బంగ్లాదేశ్ నుండి కొన్ని నెలల క్రితం మన దేశంలో అక్రమంగా చొరబడ్డాడు అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ తదితర విచారణ చర్యలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రోనిత్ రాయ్ మనకు కూడా తెలిసినవాడే. ఎన్టీఆర్ (Jr NTR) ‘జై లవకుశ’ (Jai Lava Kusa), విజయ్ దేవరకొండ ‘లైగర్’ (Liger) సినిమాల్లో నటించి మెప్పించారు.