బాక్సాఫీస్ తోపాటు ప్రేక్షకుల మీద కూడా దండయాత్రలు చేస్తున్న కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కగా.. విడుదలైన తాజా చిత్రం “రూల్స్ రంజన్”. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలోని “సమ్మోహనుడ” పాట వైరల్ అవ్వడంతో.. సినిమా జనాల్లోకి బాగా వెళ్లింది. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం కొడుకు రతినమ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: తిరుపతిలో పుట్టి పెరిగి.. ముంబైలో ఉద్యోగం సంపాదించుకొని, అక్కడే హ్యాపీగా బ్రతికేస్తుంటాడు మనోరంజన్ (కిరణ్ అబ్బవరం). చాలా ఏళ్ల తర్వాత తన క్రష్ సన (నేహా శెట్టి) సడన్ గా దర్శనమిస్తుంది. ఆమెతో తన ప్రేమ గురించి చెప్పే లోపే తిరుపతి తిరిగెళ్లిపోతుంది సన. మనోరంజన్ తన ప్రేమను సనకు చెప్పగలిగాడా? చివరికి వాళ్ళు పెళ్లి చేసుకోగలిగారా? వాళ్ళ పెళ్ళికి వచ్చిన అడ్డంకులు ఏమిటి? అనేది “రూల్స్ రంజన్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: సింపుల్ & స్మార్ట్ యంగ్ బాయ్ పాత్రలో కిరణ్ పర్వాలేదు అనిపించుకున్నాడు. కామెడీ టైమింగ్ విషయంలో మాత్రం చాలా ఇంప్రూవ్ అవ్వాలి. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ ల కామెడీ టైమింగ్ ముందు కిరణ్ మిన్నకుండిపోయాడు. నేహా శెట్టికి గ్లామర్ షోకి కానీ పెర్ఫార్మెన్స్ కి కానీ పెద్దగా స్కోప్ లేకుండాపోయింది. ఉన్న ఒక్క పాటలో మాత్రం తన సత్తా చాటుకొని సైడ్ అయిపోయింది. సినిమా మొత్తానికి రిలీఫ్ అంటే వెన్నెల కిషోర్. దొరికిన చిన్నపాటి పాత్రలో కూడా మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది కామెడీ పంచులు జబర్దస్త్ మొదలైన కొత్తలో వచ్చిన ఎపిసోడ్స్ ను గుర్తు చేసేంత పాతవి. ఇక మిగిలిన ప్యాడింగ్ ఆర్టిస్టుల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రతినమ్ కృష్ణ కథగా ఏం రాసుకున్నాడు? కథనంగా ఏం తెరకెక్కించాడు? డైలాగులేం రాసుకున్నాడు? అనేది అతడికి మాత్రమే తెలియాలి. ఎందుకంటే సినిమా పూర్తయ్యేవరకూ మూలకథ ఏమిటి? మెయిన్ పాయింట్ ఏమిటి అనేది అర్ధం కాదు. పనికిమాలిన పంచ్ డైలాగులు, అవుట్ డేటెడ్ కామెడీ ఎపిసోడ్లు, అర్ధం పర్ధం లేని సన్నివేశాలు, అర్ధం కాని స్క్రీన్ ప్లేతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుల మెదళ్ళను మెలిపెట్టాడు. ఇంతకుమించి అతడి పనితనం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.
అమ్రిష్ పాటల వరకూ బానే ఉన్నా.. నేపధ్య సంగీతం మాత్రం ఏమాత్రం బాగోలేదు. సన్నివేశంలోని ఎమోషన్ తో సంబంధం లేని సంగీతంతో ఊదరగొట్టాడు. దులీప్ కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ బాగున్నాయి.
విశ్లేషణ: కిరణ్ అబ్బవరం అర్జెంటుగా ప్రేక్షకులపై దండయాత్రలు ఆపి, ఇమ్మీడియట్ గా కథల ఎంపికపై దృష్టి సాధించాలి. అలాగే.. లుక్స్ విషయంలో కూడా జాగ్రత్తపడాలి. గత అయిదారు సినిమాల్లో కిరణ్ ఇంచుమించుగా ఒకేలా ఉన్నాడు. కనీసం హెయిర్ స్టైల్ అయినా మార్చకపోతే.. ఆడియన్స్ అతడి లుక్స్ విషయంలో ఏ సినిమాలోది అని కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం. “మ్యాడ్, చిన్నా, మంత్ ఆఫ్ మధు” లాంటి కంటెంట్ సినిమాల ముందు “రూల్స్ రంజన్” (Rules Ranjann) నిలదొక్కుకోవడం కష్టం!
రేటింగ్: 1/5
Rating
1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus