బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘తాన్హాజీ’ సినిమా పాండమిక్ కి ముందు రిలీజై రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాతో ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దీంతో తరువాత చేయబోయే సినిమాకి అది బాగా కలిసొస్తుందని అనుకున్నారు. అందుకేనేమో.. తరువాతి సినిమాను స్వీయ దర్శకత్వంలో, నిర్మాణంలో ‘రన్ వే 34’ సినిమాను రూపొందించారు. ప్రోమోలతో ఆసక్తి క్రియేట్ చేసిన ఈ సినిమా..
రెండు నెలల కిందట థియేటర్లలోకి దిగింది. సినిమాకి మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది కానీ వసూళ్లలో మాత్రం అది కనిపించలేదు. తొలిరోజు మూడున్నర కోట్ల వసూళ్లు మాత్రమే సాధించిన ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.20 కోట్ల మార్క్ ను కూడా అందుకోలేకపోయింది. చాలా రోజులు ఎదురుచూసి థియేటర్లలో రిలీజ్ చేస్తే ఇలాంటి రిజల్ట్ చూసి అజయ్ అండ్ టీమ్ కూడా షాక్ అయింది.
అయితే ఈ మధ్య బాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న సినిమాలేవీ పెద్దగా ఆడడం లేదు. ఓటీటీలో మాత్రం హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ‘రన్ వే 34’ సినిమా విడుదల కూడా ఇదే జరిగింది. అమెజాన్ ప్రైమ్ లో ముందు ఈ సినిమాను రెంట్ ఆప్షన్ తో రిలీజ్ చేశారు. కొన్ని వారాల తరువాత ఫ్రీగా సబ్‌స్క్రైబర్లందరికీ చూసే అవకాశం కల్పించారు. అప్పటినుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వాడుతోంది. సోషల్ మీడియాలో ఓ కొత్త సినిమా రిలీజ్ అయినట్లు దీని గురించి పోస్ట్ లు పెడుతున్నారు.
రిలీజ్ అయిన దగ్గర నుంచి ప్రైమ్ లో ఇదే నెంబర్ వన్ స్థానాల్లో ట్రెండ్ అవుతోంది. అందులో ఈ సినిమా చూసిన వాళ్లు థియేటర్లలో ఎందుకు ఆడలేదో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు మాస్ కంటెంట్, క్రేజ్ ఉన్న సినిమాలకే థియేటర్లకు వెళ్తున్నారు. లేదంటే ఓటీటీలో చూసుకుందామని లైట్ తీసుకుంటున్నారు. అందుకే కొన్ని సినిమాలు థియేటర్లలో వర్కవుట్ కాకపోయినా.. ఓటీటీలో హిట్ అవుతున్నాయి!