సంచలన వ్యాఖ్యలు చేసిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో

  • July 28, 2018 / 07:08 PM IST

యువ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీ చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. బడ్జెట్ ని రెండురోజుల్లో రాబట్టిన ఈ సినిమా పది కోట్ల షేర్ ని అధిగమించి దూసుకుపోతోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ అందంతో ఆకర్షించగా.. హీరోగా నటించిన కార్తికేయ నటనతో ఆకట్టుకున్నారు. తొలి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన కార్తికేయ తన సినీ ప్రయాణాన్ని చెప్పుకున్నారు. “చిన్నప్పటి నుంచి నాకు సినిమాల పిచ్చి ఎక్కువ. చిరంజీవి గారంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. ఇంద్ర సినిమా ఎన్నిసార్లు చూశానో .. ఆయన డాన్సులను ఎన్నిమార్లు ప్రాక్టీస్ చేశానో లెక్కేలేదు.

సినిమాల్లోకి వెళతానంటూ అమ్మా నాన్నలను ఒప్పించి, నటనలో శిక్షణ తీసుకున్నాను. ఏ సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నా అక్కడికి వెళ్లేవాడిని. అదిగో మొదలవుతుంది .. ఇదిగో మొదలవుతుంది అంటూ చాలామంది నన్ను తిప్పుకున్నారు. అంతా రెడీ .. ఒక లక్ష రూపాయలుంటే సినిమా మొదలైపోతుందని అంటే .. వెంటనే తెచ్చి ఇచ్చేవాడిని. కానీ ఆ సినిమా మొదలయ్యేది కాదు. ఇలా చాలామంది మోసం చేశారు.” అని వెల్లడించారు. ఆ తర్వాత తనకి దర్శకుడు అజయ్ పరిచయం కావడంతో హీరోగా మీ ముందుకు వచ్చానని వివరించారు. “అనుకున్నట్టుగానే హీరో అయినందుకు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది” అని కార్తికేయ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతను చేయబోయే సినిమా ఏంటని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus