సినిమా వేడుకల్లో హీరోయిన్స్ మితి మీరి అంగాగ ప్రదర్శన చేయడం పట్ల… మండిపడ్డారు లెజెండరీ సింగర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని గుర్తుచేశారు. తాజాగా తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బాలసుబ్రహ్మణ్యం… తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయంటూ… హీరోయిన్స్ వస్త్రధారణ పై సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.
ఈ కార్యక్రమంలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “వేదిక మీద ఓ స్త్రీ పాత్రధారిణి వచ్చి ఒక సభలో కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో అనే నిర్ణయం కూడా తీసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా? లేక మరొకటి అనుకోవాలా? కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తరువాత అక్కడకి వచ్చిన హీరోలు, నిర్మాతలు మనకు అవకాశాలు ఇస్తారని అనుకునే పరిస్థితికి మన సంస్కారం కిందికి దిగజారిపోయింది. ఈ విషయాన్ని నేను గట్టిగానే చెప్పదలుచుకున్నా.. నాకేం ఇబ్బంది లేదు. నా మీద ఏ హీరోయిన్ కోప్పడినా నాకేం ఇబ్బంది లేదు. నాకు తెలిసి వాళ్ళకు తెలుగు రాదు కాబట్టి ఇది అర్ధం కాకపోవచ్చు. ఎవరైనా డబ్బు సంపాదించాలనే సినిమా తీస్తారు. కాని దానికి ఒక నిబద్ధత, బాధ్యత, సమాజం పట్ల ఒక స్పృహ ఉండాలి”..అంటూ.. అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు ఎస్ పి బాలు.