హిట్ ఇచ్చిన తర్వాత… ఆ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఏంటి అనే ప్రశ్న సాధారణంగా వినిపిస్తుంది. అదే బ్లాక్‌బస్టర్ హిట్ ఇస్తే… ఆ ప్రశ్నలు చర్చలుగా మారిపోతాయి. ఇంకో సినిమా అనౌన్స్ చేసేంతవరకు ఆ చర్చలు నడుస్తూనే ఉంటాయి. తాజాగా ఈ స్వీట్ సిట్యువేషన్‌ను ఎదుర్కొంటున్న దర్శకుడు సాగర్ కె.చంద్ర. ‘భీమ్లా నాయక్’ లాంటి భారీ హిట్ ఇవ్వడంతో… సాగర్ నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న మొదలైంది. అయితే ఇప్పటికే సాగర్ ఓ సినిమా కమిట్ అయ్యాడు అనేది సమాచారం.
నిజానికి ‘భీమ్లా నాయక్’ కంటే ముందు సాగర్ చంద్ర ఓ సినిమా చేయాల్సి ఉంది. వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ సినిమా అనుకున్నారు. అన్నీ ఓకే ఇక సినిమా స్టార్ట్ చేయడమే ఆలస్యం అనుకుంటుండగా… సినిమా ఆగిపోయింది అనే వార్తలు వచ్చాయి. ఎందుకు, ఏంటి అనే విషయాలు అప్పట్లో తెలియలేదు. వరుణ్‌తేజ్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కాంబినేషన్లో ఈ సినిమా ఉండాల్సింది. అయితే సినిమా ఆగిపోవడంతో… సాగర్ చంద్ర ‘భీమ్లా నాయక్’ షురూ చేశారు.
అయితే సాగర్ చంద్రను ఈ విషయం అడిగితే.. నాడు జరిగింది చెప్పుకొచ్చారు. చారిత్రాత్మక కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని గతంలో అనుకున్నారట. అయితే బడ్జెట్ విషయంలో వేరే ఆలోచనలు వచ్చి… సినిమా అప్పుడు వద్దు అనుకున్నారు. అయితే అయితే ఇప్పుడు హిస్టారికల్ సినిమాలకు క్రేజ్ బాగానే ఉంది. పైగా పవన్‌తో ‘భీమ్లా నాయక్’ లాంటి మాస్ హిట్ ఇచ్చారు. దాంతో దర్శకుడిగా సాగర్ చంద్రకి కొత్త ఇమేజ్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆ సినిమాను బయటకు తీస్తారనే చర్చ నడుస్తోంది. మరోవైపు వరుణ్‌తేజ్ కూడా నెక్స్ట్ ఏ సినిమాలు కమిట్ అవ్వలేదు. ‘గని’ ఒక్కటే విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఎఫ్ 3’ కూడా సిద్ధం చేశారు. మేలో ఈ సినిమా తీసుకొస్తున్నారు. ఆ తర్వాత సాగర్ చంద్ర సినిమా పట్టాలెక్కొచ్చు అని అంటున్నారు. అయితే మరి గతంలో అనుకున్న కథనే తీసుకుంటారా, లేక ఏమైనా మార్పులు చేస్తారా? కొత్త సినిమా చేస్తారా అనేది చూడాలి.