Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్ ఏంటమ్మా తల్లీ.. ఓవర్ అనిపించడం లేదూ..
- August 29, 2026 / 01:44 PM ISTByFilmy Focus Desk
మా సినిమా బాగా ఆడుతుంది అని చెప్పే రకం కొంతమంది.. మా సినిమాకు ఇబ్బందికర ఫలితం వస్తే మా ఇంటికొచ్చేయండి అడ్రెస్ ఇదిగో అని చెప్పేవారు మరికొంతమంది. మా సినిమా ఆడకపోతే నేను ఇంకొ సినిమా చేయను అని చెప్పేవారు ఇంకొంత మంది. అయితే ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఎక్కువగా హీరోలు, దర్శకులు మాత్రమే ఇస్తుంటారు. కానీ తొలిసారి ఓ హీరోయిన్.. అందులోనూ ఇంకా ఇండస్ట్రీలో పూర్తిగా సరైన అవకాశం అందుకోని ఓ హీరోయిన్ ఈ కామెంట్లు చేసింది.
Swetha Lakshman
ఆమెనే శ్వేతా లక్ష్మణ్. శివ కుమార్ కాసారంతో కలసి ఆమె నటించిన సినిమా ‘సహ: లైఫ్ ఆఫ్ సంజు’. నిశాంత్ దోటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ శ్వేత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని శ్వేత అన్నారు. అక్కడితో ఆగకుండా ఓ శపథం కూడా చేశారు.
అందరి జీవితాలు ‘సహ’ సినిమాకు కనెక్ట్ అవుతాయి. ప్రేమంటే ఏంటో ఈ సినిమా చెబుతుంది. ప్రేమలో ఉండే బాధ, త్యాగం అన్నీ ఇందులో చూపించాం. ఈ ఎమోషన్స్‌ను అందంగా చూపించాం. ఈ రోజు నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ‘సహ’ సినిమా చూశాక ‘ఎంత మంచి సినిమా తీశారు’ అని అందరూ అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా ఈ సినిమా చూసి నిరాశపడితే నేను అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు కొట్టించుకుంటా అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ మాటను అందరూ గుర్తుపెట్టుకోండి. మేం అంత మంచి కంటెంట్‌తో వస్తున్నాం. హిట్ కొడతాం అని శ్వేత అన్నారు. మరోవైపు ఈ సినిమా అందరి అంచనాలు అందుకుంటుందని హీరో శివ కుమార్ చెప్పాడు. ఒకవేళ ఆ అంచనాలు ఒక్క శాతం అందుకోలేకపోయినా తనకు ఫోన్ చేసి తిట్టాలంటూ తన ఫోన్ నంబర్ చెప్పేశారు. చెప్పడానికి ఈ విషయాలు బాగానే ఉన్నాయి. సినిమా మీద హైప్‌ను కాస్త పెంచుతాయి. కానీ ఇంత అతి అవసరమా అనే మాటలు కూడా వినిపిస్తాయి.














