సినిమా పరిశ్రమ ఎక్కువగా కామినేషన్‌ల మీద రన్ అవుతుంది. ఈ మాట చెప్పినప్పుడు చాలామంది ఒప్పుకోరు. అలాంటి సమయంలోనే ఓ కాంబినేషన్ అనౌన్స్ అయి, దానికి మంచి హైప్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిగ్గా అంగీకరిస్తారు. ఇప్పుడు కోలీవుడ్‌లో ఇలాంటి ఓ కాంబినేషన్ సెట్ అయ్యి.. సినిమా పరిశ్రమ కాంబినేషన్ల మీద ఎంతగా ఆధారపడుతుందో చెప్పకనే చెప్పింది. అయితే ఆ సినిమా అనౌన్స్‌మెంట్ ఇంకా అవ్వలేదు.
కోలీవుడ్‌లో ఓ హిట్ హీరో – డైరెక్టర్ కాంబో రెడీ అవుతోంది. దానికి హిట్ కాంబినేషన్ హీరోయిన్‌ని ఫిక్స్ చేశారు అని చెబుతన్నారు. ఆ డైరక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాగా.. ఆ హీరో ధనుష్. ఆయన 55వ సినిమా కోసమే ఇద్దరూ కలుస్తున్నారు. ఈ సినిమా కోసం హీరోయిన్ ఇద్దరికీ హిట్ కాంబినేషన్ అయిన సాయి పల్లవిని అనుకుంటున్నారట. దాదాపు చర్చలు పూర్తయ్యాయని త్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు.
సాయిపల్లవి – ధనుష్‌ది వెండితెరపై విజయవంతమైన జోడి. వీరి నుండి వచ్చిన ‘మారి 2’ సినిమా, అందులోని ‘రౌడీ బేబీ..’ పాట ఎంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయో మీకు తెలిసిందే. మరోవైపు ‘అమరన్’ సినిమాతో దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి – సాయిపల్లవి హిట్ కాంబోగా నిలిచారు. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిస్తే థియేటర్ దద్దరిల్లడం ఖాయమని చెబుతున్నారు. మరి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న పల్లవి ఓకే చెబుతుందా అనేది చూడాలి.
సాయిపల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ సినిమాల్లో నటిస్తోంది. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా భారీ ప్రాజెక్ట్‌లో సీతగా సాయిపల్లవి కనిపించనుంది. తొలి పార్ట్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. రెండో పార్టు పనులు త్వరలో స్టార్ట్ చేస్తారట. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతోపాటు ‘మేరే రహో’ అనే మరో సినిమా కూడా సాయిపల్లవి చేసింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.