Salaar Review in Telugu: సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రభాస్ (Hero)
  • శ్రుతి హాసన్ (Heroine)
  • జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ , ఈశ్వరీ రావు , శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు.. (Cast)
  • ప్రశాంత్‌ నీల్‌ (Director)
  • విజయ్ కిరగందూర్ (Producer)
  • రవి బస్రూర్ (Music)
  • భువన్ గౌడ్ (Cinematography)
  • Release Date : డిసెంబరు 22, 2023

“బాహుబలి”తో ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయిన ప్రభాస్ అప్పటినుండి ఆ ఇమేజ్ క్యారీ చేయడం కోసం చేసుకుంటూ వస్తున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా దెబ్బపడ్డాయి. ముఖ్యంగా “ఆదిపురుష్” ప్రభాస్ ఇమేజ్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే.. ప్రభాస్ మొదలుకొని ఆయన అభిమానుల వరకు అందరికీ “సలార్” మీద మాత్రం విపరీతమైన నమ్మకం. ముఖ్యంగా “కెజిఎఫ్” తర్వాత ప్రశాంత్ నీల్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. మరి “సలార్” ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: తన తల్లి ఆస్తికలను గంగలో కలపడం కోసం అమెరికా నుంచి కాశీకి వచ్చిన ఆద్య (శ్రుతిహాసన్)ను రాధారమ మన్నార్ (శ్రియా రెడ్డి) & గ్యాంగ్ టార్గెట్ చేసి చంపాలనుకుంటారు. ఆమెను కాపాడడం కోసం బిలాల్ (మైమ్ గోపీ) ఆమెను.. అస్సామ్ బోర్డర్ లోని టింసాకు అనే గ్రామంలో హెవీ వెహికిల్స్ మెకానిక్ గా ఒక సాధారణ జీవితాన్ని సాగిస్తున్న దేవరథ (ప్రభాస్) & తల్లి (ఈశ్వరీ రావు) వద్దకు తీసుకువస్తాడు.

ఆద్యను కాపాడడం కోసం అజ్ఞాతంలో ఉన్న దేవరథ దాల్చిన ఉగ్రరూపాన్ని చూసి.. ఆమెను వేటాడడం కోసం వచ్చిన మన్నార్ గ్యాంగ్ మొత్తం హడలెత్తుతుంది. అసలు ఎవరీ దేవరథ? మన్నార్ కుటుంబంతో ఇతడికి ఉన్న సంబంధం ఏమిటి? కాన్సార్ అనే దేశంలో దేవరథను ఎందుకు కటేరా తల్లి కొడుకులా భావిస్తారు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నల సమాహారమే “సలార్” మొదటి భాగం.

నటీనటుల పనితీరు: ప్రభాస్ “కటౌట్”ను మునుపటి మూడు సినిమాల దర్శకులు సరిగా వినియోగించుకోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో? ప్రభాస్ ఎలా అయితే తెర నిండుగా కనిపిస్తాడో.. సరిగ్గా అదే భీభత్సమైన తీరులో ప్రెజంట్ చేసిన సినిమా “సలార్”. గుద్దుకొకడు సచ్చుడు ప్రభాస్ లాంటి మహాకాయుడికి మాత్రమే సెట్ అయ్యే ఎలివేషన్, దాన్ని ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ & మ్యానరిజమ్స్ తో అద్భుతంగా ఎలివేట్ చేసాడు. ఆరడుగుల ప్రభాస్.. ఆకాశమంత ఎత్తులో ఆజానుబాహుడిలా కనిపిస్తూ.. శత్రువుల గుండెలో దడలు పుట్టిస్తుంటే.. అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ఒక నటుడిగా ప్రభాస్ స్థాయిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయినా.. అతడి పర్సనాలిటీ & బాడీ లాంగ్వేజ్ ను అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్న సినిమా ఇది.

నిజానికి ఈ కథ మొత్తం శ్రుతిహాసన్ చుట్టూ తిరుగుతుంది. ఆమె సొంత డబ్బింగ్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ.. నటిగా మాత్రం సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా నిలవలేకపోయింది. అందువల్ల.. భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన ఆమె పాత్ర ఒక సాధారణ క్యారెక్టర్ లా మిగిలిపోయింది.
పృథ్విరాజ్ సుకుమార్ క్యారెక్టర్ సరిగ్గా ఇంటర్వెల్ లో వచ్చినా.. స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించాడు. అయితే.. అతడు కష్టపడి చెప్పుకున్న సొంత డబ్బింగ్ మాత్రం క్యారెక్టర్ ఎలివేషన్ కు మైనస్ లామారింది.

శ్రియా రెడ్డి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. “పొగరు” తర్వాత మళ్ళీ అదే స్థాయి నటనతో విశేషంగా ఆకట్టుకుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ & కళ్ళు కథలో చాలా కీలకం. తమిళ నటుడు మైమ్ గోపీకి మంచి క్యారెక్టర్ దొరికింది. అతడు దానికి న్యాయం చేసాడు కూడా. జగపతిబాబు, బాబీ సింహా తదితరుల పాత్ర స్థాయి ఏమిటి అనేది సెకండ్ పార్ట్ లో అర్ధమవుతుంది.

సాంకేతికవర్గం పనితీరు: రవి భస్రూర్ సంగీతం కొన్ని సన్నివేశాల్లో ప్లస్ పాయింట్ గా ఉండగా.. చాలా కీలకమైన సన్నివేశాల్లో మైనస్ లా మారింది. కటేరా తల్లి సమక్షంలో జరిగే సెకండాఫ్ ఫైట్ లో సౌండ్ డిజైనింగ్ వర్క్ మాత్రం మెచ్చుకొని తీరాలి. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి ఆయువుపట్టు అని చెప్పాలి. ప్రభాస్ ను ఆజానుబాహుడిలా చూపడం కోసం అతడు పెట్టిన కొన్ని ఫ్రేమ్స్ & కెమెరా స్టేజింగ్ ను ప్రభాస్ హైట్ కు తగ్గట్లుగా మలిచిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాను లాస్ట్ రో కంటే ఫస్ట్ రోలో కూర్చుని చూస్తే వచ్చే కిక్ వేరే లెవల్ లో ఉంటుంది.

ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్ వర్క్, లైటింగ్, డి.ఐ వంటి టెక్నీకాలిటీస్ లో వేలెత్తి చూపే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు దర్శకనిర్మాతలు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకోవాలి. బేసిగ్గా ప్రశాంత్ నీల్ బాహుబలి సినిమాను తన స్టైల్లో తీసాడని చెప్పాలి. వరల్డ్ బిల్డింగ్ కానీ, క్యారెక్టర్ ఎలివేషన్స్ కానీ, ప్రభాస్ క్యారెక్టర్ జర్నీ & ముఖ్యంగా క్లైమాక్స్ ను అతడు డిజైన్ చేసిన తీరు “బాహుబలి”ని గుర్తుకు చేస్తాయి. సలార్ ను మోడ్రన్ బాహుబలి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

అయితే.. ఒక దర్శకుడిగా కంటే ఒక రచయితగా ప్రశాంత్ ఎక్కువ మార్కులు కొట్టాడు. కాన్సార్ ప్రపంచాన్ని అతడు సృష్టించిన తీరు అభినందనీయం. ముఖ్యంగా ఆ ప్రపంచంలోని తెగలను పరిచయం చేసిన తీరు హాలీవుడ్ చిత్రం “300”ను గుర్తుకు చేస్తోంది. అలాగే.. ప్రభాస్ పర్సనాలిటీని సరిగ్గా ప్రెజంట్ చేసిన మూడో దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు ప్రభాస్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

విశ్లేషణ: లెక్కలేనన్ని విజిల్ మూమెంట్స్, ప్రభాస్ అభిమానులు చొక్కాలు చించేసుకునే స్థాయి సెకండాఫ్, సినిమా స్థాయిని మరింత పెంచే క్లైమాక్స్ & సెకండ్ పార్ట్ కోసం ఇచ్చిన అద్భుతమైన లీడ్ కలగలిసి “సలార్ పార్ట్ 1” యాక్షన్ మూవీ లవర్స్ & ప్రభాస్ ఫాన్స్ కు ఒక మస్ట్ వాచ్ ఫిలింగా నిలిపాయి.


రేటింగ్: 3/5

Click Here to Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus