బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా వుడ్‌ల డిఫరెన్సియేషన్ లేకుండా.. అంతా ఒకటే అవ్వాలి, ఒకే పేరుతో పిలవాలి అంటూ చాలా రోజుల నుండి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై అంతగా ఆసక్తి చూపించని బాలీవుడ్ ఇప్పుడు సౌత్‌తో టై అప్ అవ్వడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా చక్కగా ఒడిసిపట్టుకుంటోంది. కరోనా తర్వాతి పరిస్థితుల్లో బాలీవుడ్ పరిస్థితే దీనికి కారణం అని చెబుతుంటారు సినీ పరిశీలకులు. అయితే ఈ ప్రభావమో, ఇంకేదైనా కారణం ఉందో కానీ.. సల్మాన్ నార్త్ – సౌత్ మల్టీస్టారర్ అనే మాట వినిపిస్తోంది.
చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ ముఖ్య పాత్రలో కాసేపు కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల ముంబయిలో జరిగింది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ హిందీ, దక్షిణాది పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఒక్కో సినిమాకి రూ. మూడు వేల కోట్ల నుండి రూ. నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని చెప్పాడు. అంతేకాదు కొందరు హాలీవుడ్ చిత్రాల్లో పని చేయాలనుకుంటున్నారు. నేనైతే దక్షిణాది సినిమాల్లో నటించాలి అనుకుంటున్నా అని కూడా చెప్పాడు.
హిందీ, దక్షిణాది నటులు కలసి సినిమాలు చేస్తే వసూళ్ల లెక్కలు ఊహించని విధంగా ఉంటాయి. ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు ప్రేక్షకులు, సినిమా జనాలు ఇప్పుడు రూ.300 కోట్లు -రూ.400 కోట్లు సినిమా అని మాట్లాడుకుంటున్నారు. అదే బాలీవుడ్, సౌత్ కలిస్తే రూ.3,000 కోట్లు -రూ.4,000 కోట్లను ఈజీగా సంపాదించొచ్చు అని అంచనా వేశాడు.
ప్రస్తుత రోజుల్లో మల్టీస్టారర్ సినిమాలు చేస్తే ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా ప్రపంచం మొత్తం చూస్తుంది అని అన్నాడు సల్మాన్. అన్నట్లుగా సల్మాన్ నెక్స్ట్ చేస్తున్న ‘కిసీ కీ భాయ్ కిసీ కీ జాన్’లో కూడా సౌత్ స్టార్ నటుల్ని ఎంచుకున్నాడు సల్మాన్. ఆ సినిమాలో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. రామ్‌చరణ్ కూడా ఓ పాటలో అతిథి పాత్రలో నటించాడట.