ప్రముఖ కథానాయిక సమంత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా ‘శుభమ్’ అనే సినిమా చేసి అశుభ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా కాస్త ఆసక్తిరేపినా ఫలితం అందుకుతగ్గట్టుగా రాలేదు. ఇప్పుడు మరోసారి సమంత నిర్మాతగా మారే ప్రయత్నం చేస్తోందని సమాచారం. ఈ సారి తన స్నేహితురాలైన ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారు అని సమాచారం. అందులో ప్రధాన పాత్రలో నటించేది కూడా సమంతనే అని చెబుతున్నారు.
వైవిధ్యమైన కథలతో సినిమాలు నిర్మిస్తా అని సమంత తన బ్యానర్ ‘ట్రాలాలా’ ఏర్పాటు చేసినప్పుడే చెప్పింది. ఆ ఆలోచనతోనే ఓ కొత్త ప్రాజెక్టులో భాగమవుతోంది. ఆమెతో రెండు సినిమాలు రూపొందించిన నందిని రెడ్డి కొత్త కథతో రాబోతున్నారు. గతంలో ఈ ఇద్దరూ ‘జబర్‌దస్త్’, ‘ఓ బేబీ’ చేశారు. అంటే ఈ సినిమా హ్యాట్రిక్ అన్నమాట. సిద్ధార్థ్‌తో చేసిన ‘జబర్దస్త్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ‘ఓ బేబీ’ అయితే మంచి విజయాన్నే అందుకుంది. కాబట్టి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి.
అయితే నందిని రెడ్డి గత ప్రాజెక్ట్‌లు ‘పిట్టకథలు – మీరా’, ‘అన్నీ మంచి శకునములే’ సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో నందిని రెడ్డికి ఈ సినిమా ఫలితం చాలా కీలకం. ఇక సమంతకు కూడా అదే పరిస్థితి. ఆమె ప్రధాన పాత్రలో నిర్మిస్తూ నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఏమైందో తెలియడం లేదు. కాబట్టి ఈ సినిమా ఫలితం ఆమె కెరీర్‌కి చాలా కీలకం. అన్నట్లు నందిని రెడ్డి కొత్త సినిమా జోనర్ ఏంటి చెప్పలేదు అనుకుంటున్నారా? సమంత నిర్మిస్తోంది అంటే కచ్చితంగా హీరోయిన్ ఓరియెంటెడే.
ఇక సమంత సంగతి చూస్తే రెండేళ్ల క్రితం ‘ఖుషి’ సినిమాతో తెలుగులో వచ్చింది. ఆ తర్వాత రాలేదు. గతేడాది ‘సిటడెల్’తో వెబ్‌సిరీస్‌తో వచ్చింది. కొత్త వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్’ షూటింగ్ దశలో ఉంది.