పుష్ప సినిమాలోని స్పెషల్ సాంగ్ తో స్టార్ హీరోయిన్ సమంత వార్తల్లో నిలుస్తున్నారు. ఈ పాటకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. పుష్ప పార్ట్1 రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 17వ తేదీన విడుదలయ్యే ఈ సినిమా సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాతో రంగస్థలం సినిమాను మించిన సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మరోవైపు సమంత కొత్త ప్రాజెక్టులతో బిజీ అవుతున్నారు. అయితే రెండు నెలల క్రితం చైతన్యతో విడిపోతున్నట్టు సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సమంత విడాకుల గురించి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా సమంత నాగచైతన్యతో విడాకుల అంశం గురించి ఇకపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని వెల్లడించారు. తాను, నాగచైతన్య విడిపోవడం గురించి చాలామంది చాలారకాలుగా అనుకుంటున్నారని సామ్ తెలిపారు.
విడాకుల వ్యవహారం గురించి ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పానని సామ్ అన్నారు. అందువల్ల విడాకుల అంశం గురించి మళ్లీమళ్లీ స్పందించాల్సిన అవసరం లేదని సామ్ పేర్కొన్నారు. కొన్నిరోజుల క్రితం చైతన్యతో విడిపోయిన సమయంలో తాను చనిపోవాలని అనుకున్నానని మానసిక కుంగుబాటుకు లోనయ్యానని సామ్ వెల్లడించారు. ఈ ఏడాది తనకు వ్యక్తిగతంగా కలిసిరాలేదని సామ్ అన్నారు.
ఏ మాయ చేశావె సినిమా షూటింగ్ సమయంలో చైతన్య సమంతల మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత రోజుల్లో ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి చైతన్య సమంత పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత మనస్పర్ధలు రావడంతో వాళ్లు విడిపోయారు. సమంత యశోద, అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పుష్పలో చేసిన స్పెషల్ సాంగ్ సమంత కెరీర్ కు ప్లస్ అవుతుందేమో చూడాలి. స్టార్ డైరెక్టర్ సుకుమార్ పై ఉండే గౌరవం వల్ల సామ్ స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పారని తెలుస్తోంది.