Samantha, Mammootty: సమంత కోరిక తీరబోతోందా? ఆయనతో సినిమా ఓకేనా?

అభిమాన హీరోతో ఫొటో దిగడం మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అదే నటులకు అయితే వాళ్లతో నటించడం ఆనందాన్నిస్తుంది. అలాంటి ఆనందంలో ఇప్పుడు సమంత ఉందా? అవుననే అంటున్నాయి మాలీవుడ్‌ వర్గాలు. అవును సమంత ఫేవరెట్‌ హీరోతో నటించే అవకాశాన్ని అందుకుంది. ఇప్పటికే ఓ సారి యాడ్‌లో నటించి మురిసిపోయిన సామ్‌.. ఇప్పుడు ఏకంగా సినిమా ఛాన్సే సంపాదించింది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్‌మెంట్‌ వస్తుందట.

మీ అభిమాన హీరో ఎవరు అంటే? ఠక్కున మమ్ముట్టి అని చెప్పేస్తుంది సమంత. అంతలా ఆయన్ని ఆరాదిస్తూ ఉంటుంది. ఈ మధ్య ఓ ప్రకటన కోసం మలయాళ మెగాస్టార్‌తో నటించి మురిసిపోయింది. ఇప్పుడు ఆయనతో తెరను పంచుకోనుంది అని అంటున్నారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా సమంత నటిస్తున్నట్లు సమాచారం.

నిజానికి ఈ ప్రాజెక్టులో మమ్ముట్టికి జోడీగా తొలుత నయనతారను ఎంపిక చేశారు. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో ఆ ప్లేస్‌లో నటించడానికి సమంతను తీసుకోవాలని చూస్తున్నారని టాక్‌. ప్రస్తుతం ఆమెతో చిత్రబృందం చర్చలు జరుపుతోందట. ఓవైపు ఆమెను సినిమాల్లో హీరోయిన్‌ను చేసిన గౌతమ్‌ మేనన్‌, మరోవైపు ఫేవరెట్‌ హీరో.. ఈ అవకాశాన్ని ఆమె వదులుకుంటుందని చెప్పలేం. తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఇప్పటికే తానెంటో నిరూపించుకున్న సమంత ఇటీవల హిందీలో ఓ ప్రాజెక్ట్‌ చేసింది.

ఇప్పుడు ఈ సినిమాతో మలయాళంలో కూడా అడుగుపెట్టనుంది. ఈ నెల 15 నుండి సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఆ రోజు ఈ విషయంలో ప్రకటన ఉండొచ్చు. ఇదిలా ఉండగా చాలా నెలలుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా అనౌన్స్‌ చేసింది. ఆ సినిమాకు ఆమెనే నిర్మాత కూడా. హిందీలో చేసిన ‘సిటడెల్‌’ వెబ్‌ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్‌కి సిద్ధమవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus