ఇండియన్ సినిమాలో హాట్ టాపిక్ అంటే… సినిమాటిక్ యూనివర్స్. అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఇప్పుడు ఇలాంటి యూనివర్స్‌లు సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శకులు. తెలుగులో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఆ పనిలో ఉండగా… అంతకంటే ముందు తమిళంలో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ పని చేసేశారు. మరి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడా కన్నడ ఇండస్ట్రీలో ఇదే పనిలో ఉన్నారని టాక్. మలయాళం సంగతి చూడాలి. అయితే తెలుగులో ఇలాంటిదే మరొక సినిమాటిక్ యూనివర్స్ వస్తుందా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా వినిపిస్తుండగా… ఇప్పుడు ఆ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
తెలుగు సినిమాల్లో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) చూపించిన మార్క్ చాలా డిఫరెంట్. ఆయన హీరోలు సగటు తెలుగు సినిమా హీరోల్లా ఉండరు. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమాలోనే అలాంటి హీరోలు ఉండరు. అందుకే ఆ హీరోలు అంతా ఒక చోట కలిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో నెటిజన్లు, సినిమా జనాలు ‘సందీప్ రెడ్డి వంగా సినిమాటిక్ యూనివర్స్’ అనే చర్చ పెడుతున్నారు. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాల హీరోలను ఒకచోటకు చేర్చే ఉద్దేశంలో ఉన్నారు.
చెన్నైలో జరిగిన ఓ అవార్డు వేడుకకు హాజరైన సందీప్ రెడ్డి వంగాను ‘సినిమాటిక్ యూనివర్స్’ గురించి అడిగితే… అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని తేల్చిపారేశారు. విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ప్రభాస్‌తో మీ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేసే అవకాశం ఉందా? అని అడగ్గా… క్లియర్‌గా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పేశారు. అయితే ఒకవేళ ఏదైనా మంచి పాయింట్ తడితే కచ్చితంగా చేస్తానని చెప్పారు. దీంతో అలాంటి పాయింట్ వెంటనే తట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అర్జున్ రెడ్డి (Arjun Reddy) – విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ; కబీర్ సింగ్- షాహిద్ కపూర్ (Shahid Kapoor) ; యానిమల్ (Animal) – రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) వెండితెర మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించారో మనందరికీ తెలిసిందే. ఇక త్వరలో సందీప్… ప్రభాస్‌తో (Prabhas) ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమాను తీస్తారు. అందులో ప్రభాస్ నెవర్ బిఫోర్‌లా ఉంటాడు అని అంటున్నారు. అందుకే ఈ నలుగురూ కలవాలని, సినిమాటిక్ యూనివర్స్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.