Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే కానీ.. వంగా ముందున్న అసలు గండం ఇదే!

సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సంచలనం. కేవలం మూడు సినిమాలతోనే దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు. అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేసి, కబీర్ సింగ్ తో బాలీవుడ్ ను ఏలి, యానిమల్ తో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ తో ‘స్పిరిట్’ అంటూ రాబోతున్నాడు. అయితే ఈ ప్రయాణంలో సందీప్ ముందు ఒక పెద్ద సవాలు పొంచి ఉంది. అదే అంచనాలను అందుకోవడం.

Spirit

యానిమల్ సినిమాలో వయోలెన్స్ ఏ రేంజ్ లో ఉందో చూశాం. ఇప్పుడు స్పిరిట్ లో అంతకు మించి ఉంటుందని టాక్. ప్రభాస్ ను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా, అంతే క్రూరంగా చూపించబోతున్నాడు. ఫ్యాన్స్ వరకు ఇది పెద్ద కిక్ ఇచ్చే న్యూసే. కానీ సామాన్య ప్రేక్షకుడికి ఇది ఎంతవరకు ఎక్కుతుందనేదే అసలు పాయింట్. వయోలెన్స్ అనేది కథలో ఒక భాగంగా ఉంటేనే బాగుంటుంది తప్ప, అదే కథగా మారితే కష్టం.

దీనికి లేటెస్ట్ ఉదాహరణగా బాలయ్య అఖండ 2 గురించి చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ ఆ మాస్ జాతరను ఎంజాయ్ చేసినా, బయట ఆడియన్స్ నుంచి మాత్రం టేకింగ్ విషయంలో, లౌడ్ నెస్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. కథలో ఎమోషన్ కంటే సౌండ్, యాక్షన్ ఎక్కువైతే వచ్చే సమస్య ఇది. ఇప్పుడు సందీప్ వంగా కూడా స్పిరిట్ విషయంలో ఇలాంటి ట్రాప్ లో పడకుండా చూసుకోవాలి.

కేవలం రక్తపాతం, బూతులు ఉంటేనే సినిమా అనే ముద్ర పడకుండా జాగ్రత్త పడాలి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోవడానికి కారణం వాళ్లు ఎమోషన్ ను బ్యాలెన్స్ చేసే విధానమే. ఎంత యాక్షన్ ఉన్నా, దాని వెనుక బలమైన కథ ఉంటుంది. సందీప్ కూడా ఇప్పుడు అదే లీగ్ లోకి వెళ్లాలంటే కేవలం తన మార్క్ వైల్డ్ నెస్ మీద మాత్రమే ఆధారపడకూడదు.

యానిమల్ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కలెక్షన్లు వచ్చాయి కాబట్టి సరిపోయింది. కానీ ప్రతిసారీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెప్పలేం. ఈసారి ఏ మాత్రం తేడా కొట్టినా, శ్రుతి మించినా ట్రోలింగ్ గట్టిగా ఉంటుంది. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఉన్నప్పుడు ఆడియన్స్ రేంజ్ చాలా పెద్దదిగా ఉంటుంది. కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేస్తే సరిపోదు. మరి వంగా స్ట్రాటజీ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus