తెలుగు దర్శకులు ఇతర చిత్ర పరిశ్రమలకు వెళ్లి సినిమాలు చేస్తే మనకు ఆనందమే. అయితే ఆ దర్శకుడు తెలుగులో విశ్వ ప్రయత్నాలు చేసి… అవకాశం దొరక్క వేరే పరిశ్రమలకు వెళ్తే బాధ అనిపిస్తుంది. తాజాగా ఓ దర్శకుడు బాలీవుడ్ వెళ్లి ఓ సినిమా చేసుకున్నాడు. అయితే ఆయన తెలుగులో చాలా ప్రయత్నాలు చేసి… ఏదీ కుదరక బాలీవుడ్ వెళ్లాడని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. తొలి సినిమా ‘ఘాజీ’తో తనేంటో నిరూపించుకున్నాడు సంకల్ప్ రెడ్డి.
కమర్షియల్ ఎలిమెంట్స్ పూర్తి దూరంగా, వైవిధ్యంగా రూపొందిన సినిమా సంకల్ప్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ ఫ్లోలో చేసిన ‘అంతరిక్షం’బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. దీంతో చాలా రోజులుగా సంకల్ప్ రెడ్డి తర్వాతి సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా ఓకే అయ్యింది. విద్యుత్ జమ్వాల్ కథానాయకుడిగా, నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. దానికి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తాడు.ఈ సినిమాతో విద్యుత్ తొలిసారి నిర్మాతగా మారుతున్నాడు.
ఈ సినిమాకు ‘ఐబీ 71’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. మరి ఈ సినిమాతో సంకల్ప్ రెడ్డి బాలీవుడ్ లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. అది పక్కనపెడితే ఇక్కడ ఇంత మంది హీరోలు ఉండి… మన దర్శకులు బయటకు వెళ్లి కథలు వెతుక్కోవడం ఏంటో?