వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam). ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ రూరల్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. నిజానికి సంక్రాంతికి విడుదలైన మూడు సినిమాల్లో ఎక్కువ బజ్ క్రియేట్ చేసిన సినిమా ఇదే. పాటలు కూడా జనాల్లోకి చొచ్చుకుపోయాయి. మరి అనిల్ రావిపూడి ఏమేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..!!
కథ: ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్) కిడ్నాప్ అవుతాడు. దాంతో అతడ్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి స్పెషల్ రికమెండేషన్ తో వై.డి.రాజు అలియాస్ చిన్నరాజు (వెంకటేష్)ను రంగంలోకి దింపాలని మీనాక్షి (మీనాక్షి చౌదరి) రాజమండ్రి వస్తుంది.
నలుగురు పిల్లలు, చక్కని భార్య భాగ్యం (ఐశ్వర్య రాజేష్)తో ఆనందంగా ఉన్న చిన్న రాజు సకుటుంబ సమేతంగా ఆకెళ్లను కాపాడే మిషన్ ను మొదలెడతాడు.
ఆ క్రమంలో ఎదుర్కొన్న సమస్యలేమిటి? వాటిని రాజు-మీను-భాగ్యం గ్యాంగ్ ఎలా అధిగమించారు? అనేది “సంక్రాంతికి వస్తున్నాం” కథాంశం.
నటీనటుల పనితీరు: వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిన్న రాజు పాత్రలో ఆయన పండించే కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్ లో వెంకీ నటన & డైలాగులు హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి.
ఈ సినిమాకి సెకండ్ హీరో బుల్లి రాజు పాత్రలో జీవించేసిన రేవంత్. ఫస్ట్ ప్రెస్ మీట్ నుండి ఈ బుడ్డోడికి అంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నారా అనుకున్నా కానీ.. సినిమా చూస్తే అర్థమవుతుంది బుడ్డోడి తాండవం ఏ స్థాయిలో ఉంది. ఈ క్యారెక్టరైజేషన్ జంధ్యాల గారి “హై హై నాయక” చిత్రాన్ని గుర్తుచేసినా.. బుల్లి రాజు హావభావాలు & డైలాగులకు థియేటర్లు నవ్వులతో హోరెత్తిపోవడం ఖాయం.
సీనియర్ నరేష్ & విటివి గణేష్ కాంబినేషన్ కామెడీ అక్కడక్కడా వర్కవుట్ అయ్యింది. ఐశ్వర్య రాజేష్ – మీనాక్షి చౌదరిల నటన కంటే వారి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా వీళ్లిద్దరి మధ్య వెంకటేష్ నలిగిపోయే సన్నివేశాలు బాగా పేలాయి.
సాయికుమార్, “ఆనిమల్” ఫేమ్ ఉపేంద్ర కాంబినేషన్ లో “బేస్ వాయిస్ – పీల గొంతు” కామెడీ ట్రాక్ కొంతమేరకు బాగానే నవ్వించింది. “రంగబలి” అనంతరం రచయిత అనంత్ శ్రీరామ్ మరోమారు నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మిగతా నటీనటులందరూ ఫర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అనిల్ రావిపూడి ఒక సింపుల్ కథలో వీలైనంత హాస్యాన్ని నింపి ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నంలో కొంత మేరకు విజయం సాధించాడు. బుల్లి రాజు ఎపిసోడ్స్ & వెంకటేష్ కామెడీ టైమింగ్ ను చక్కగా వినియోగించుకున్నాడు. అయితే.. హాస్యం కూడా సహజంగా ఉండొచ్చు, పండొచ్చు అనే విషయాన్ని అనిల్ రావిపూడి పెద్దగా పట్టించుకోడు. అందువల్ల.. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ హాస్యాన్ని ఆస్వాదించలేరు. క్లైమాక్స్ లో వచ్చే “గురు దక్షిణ” ఎపిసోడ్ ను ఇంకాస్త చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. మరి కామెడీ మధ్యలో ఆ సీరియస్ ఎపిసోడ్ వద్దులే అనుకున్నాడో ఏమో కానీ.. క్లైమాక్స్ లో తగిలించేసి వదిలేశాడు. నిజానికి మంచి వేల్యు ఉన్న ఎపిసోడ్ ఇది. సరిగ్గా వాడి ఉంటే కచ్చితంగా సినిమాకి ప్లస్ అయ్యేది. అయితే.. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే వెంకటేష్ ఫ్రస్ట్రేషన్ ఫైట్ తో మాత్రం బాగా ఎంగేజ్ చేసాడు ఆడియన్స్ ని. ఓవరాల్ గా ఒక దర్శకుడిగా, రచయితగా బొటాబొటి మార్కులతో పర్వాలేదనిపించుకుని.. సంక్రాంతికి పండగ మీద భారం వేసేశాడు. స్టాటిస్టికల్ గా వర్కవుట్ అయ్యే క్యాల్కులేటెడ్ రిస్క్ ఇది.
భీమ్స్ సంగీతం అందించిన పాటలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్, నేపథ్య సంగీతంతో కూడా పర్వాలేదనిపించుకున్నాడు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది.
ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తపడ్డారు. కామెడీ జోనర్ సినిమాకి మరీ రియలిస్టిక్ సెట్స్ ఎందుకు అనుకున్నారో ఏమో.. పైపైన మెరుగులతో చుట్టేశారు. అందువల్ల టెక్నికల్ గా పెద్దగా అలరించలేకపోయింది.
విశ్లేషణ: అనిల్ రావిపూడి టార్గెట్ ఆడియన్స్ వేరు, అందువల్ల కొందరికి ఇది క్రింజ్ అనిపించినా దాన్ని అనిల్ ఏమాత్రం ఖాతరు చేయడు. ఒక డైరెక్టర్ గా ఆడియన్స్ పల్స్ మీద క్లారిటీ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. అందుకే.. తన నుంచి ప్రేక్షకులు కోరుకునే కామెడీతో పుష్కలంగా నింపేసాడు. అసలే సంక్రాంతి సెలవులు, ఆపై థియేటర్లలో వెంకటేష్ సినిమా, అది కూడా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్. మరి టికెట్లు తెగకుండా ఉంటాయా చెప్పండి. ఏదేమైనా.. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ కచ్చితంగా “సంక్రాంతికి వస్తున్నాం” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫోకస్ పాయింట్: బల్లి రాజు వచ్చాడు.. చిన్న రాజు సక్సెస్ కొట్టాడు!
రేటింగ్: 3/5