సప్తగిరి ఎల్.ఎల్.బి

  • December 7, 2017 / 09:38 AM IST

స్టార్ కమెడియన్ సప్తగిరి కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం “సప్తగిరి ఎల్.ఎల్.బి”. హిందీలో సూపర్ హిట్ అవ్వడంతోపాటు నేషనల్ అవార్డ్ సైతం గెలుచుకున్న “జాలీ ఎల్.ఎల్.బి”కి రీమేక్ ఇది. ఈ చిత్రాన్ని గతేడాది తమిళంలో “మనితన్” పేరుతో రీమేక్ చేయగా అక్కడ విజయం సాధించలేకపోయింది. మరి తెలుగు రీమేక్ ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : ఓ మారుమూల గ్రామానికి చెందిన లాయర్ సప్తగిరి (సప్తగిరి). తన ఊర్లో ఉంటే.. తాను ఇష్టపడ్డ మరదల్ని (కశిష్ వోరా) పెళ్లాడడం, లాయర్ గా ఎదగడం కష్టమని భావించి హైద్రాబాద్ వస్తాడు. ఆరు నెలలపాటు ఎంత కష్టపడినా ఒక్క కేసు కూడా దొరకదు. ముందు లాయర్ గా పేరు తెచ్చుకొంటే కేసులు అవే వస్తాయని భావించిన సప్తగిరి క్లోజ్ చేయబడ్డ ఒక హిట్ అండ్ రన్ కేస్ ను రీఓపెన్ చేయిస్తాడు.

ఆ కేస్ డీల్ చేస్తున్నది ఫేమస్ క్రిమినల్ లాయర్ రాజ్ పాల్ (సాయికుమార్) అని తెలుసుకొని తొలుత భయపడినా.. ఆ హిట్ అండ్ రన్ కేసులో చనిపోయింది అందరూ అనుకొంటున్నట్లుగా బిచ్చగాళ్ళో, అనాధలో కాదని.. దేశానికి వెన్నుముక లాంటి రైతులని తెలుసుకొని చలించిపోయి.. సీరియస్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. డబ్బు మదంతో కొందరు అడ్డుపడినా న్యాయాన్ని నమ్మిన సప్తగిరి చివరివరకూ ప్రాణాలు పణంగా పెట్టుకొని మరీ పోరాడతాడు. చివరికి కేసు గెలిచాడా, లేదా? ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది “సప్తగిరి ఎల్.ఎల్.బి” కథాంశం.

నటీనటుల పనితీరు : కమెడియన్ గా సప్తగిరికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. తన హైపర్ యాక్టింగ్ తో కామెడీ సీన్స్ ను విశేషంగా పండించే సప్తగిరి ఈ సినిమాలోనూ కామెడీ సీన్లలో బాగానే నటించాడు. అయితే.. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేయాల్సిన చోట కూడా అతి చేయడం వల్ల సన్నివేశాలు సరిగా పండలేదు. కానీ.. క్లైమాక్స్ కోర్ట్ రూమ్ ఎపిసోడ్ లో మాత్రం అద్భుతమైన నటనతో ఆకట్టుకొన్నాడు. అయితే.. డ్యాన్సర్ గా తనను తాను ప్రూవ్ చేసుకొందామన్న తపనతో వేసిన కుప్పి గెంతులు మాత్రం ఇబ్బందిపెట్టాయి. కశిష్ వోరా కేవలం పాటలకు మాత్రమే పరిమితమైపోయింది. రెండు సన్నివేశాలున్నప్పటికీ.. వాటిలోనూ లిప్ సింక్ లేకపోవడంతో ఆమె పాత్ర రిజిష్టర్ కూడా అవ్వలేదు.

క్రిమినల్ లాయర్ గా సాయికుమార్ మరోమారు తన సీనియారిటీని ప్రూవ్ చేసుకొన్నాడు. అయితే.. బాడీ లాంగ్వేజ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేదనిపిస్తుంది. జడ్జి పాత్రకు మాత్రం శివప్రసాద్ పూర్తి న్యాయం చేశారు. మరీ ఒరిజినల్ లో నటించిన సౌరభ్ శుక్లాను మరిపించకపోయినా.. తన స్థాయిలో ఆకట్టుకోగలిగారు.

సాంకేతికవర్గం పనితీరు : బుల్గానిన్ పాటలు వినడానికి సోసోగా ఉండడమే కాక తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకొనే స్థాయిలో లేకపోవడంతో ఒక్క పాట కూడా రిజిష్టర్ అవ్వదు. చిన్నా తన నేపధ్య సంగీతంతో సినిమాకి మంచి ఫీల్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ & ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ కి చిన్నా నేపధ్య సంగీతం పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి. సారంగం సినిమాటోగ్రఫీ మరీ బ్రైట్ గా ఉంది. సాంగ్స్ పిక్చరైజేషన్ లో క్లారిటీ లేదు. కెమెరా మూమెంట్ మరీ ఎక్కువగా ఉండడంతో అంత అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దర్శకుడు చరణ్ హిందీ వెర్షన్ కథను తెలుగు నేటివిటీకి, ఆడియన్స్ కి తగ్గట్లుగా మార్చిన విధానం బాగుంది. ముఖ్యంగా రైతులను ప్రధానాంశంగా కథను తీర్చిదిద్దిన విధానం, క్లైమాక్స్ వరకూ ట్విస్ట్ ను మెయింటైన్ చేసిన తీరు ఆడియన్స్ ను తప్పకుండా అలరిస్తాయి. కాకపోతే.. ఫస్టాఫ్ మొత్తం కామెడీకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంతో కథనంలో జనాలు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేరు. పైగా.. దర్శకుడు ఎక్కువగా “చెట్టు కింద ప్లీడర్” నుంచి స్పూర్తి తీసుకోవడం, సప్తగిరిని కొన్ని సన్నివేశాల్లో కంట్రోల్ చేయలేకపోవడంతో ఓవరాల్ గా దర్శకుడిగా చరణ్ జస్ట్ పాసయ్యాడు.

విశ్లేషణ : సప్తగిరి కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్, ఒరిజినల్ వెర్షన్ “జాలీ ఎల్.ఎల్.బి” చూడని ప్రేక్షకులు, కామెడీ ఎంటర్ టైనర్స్ ను ఆదరించేవారు ఒకసారి చూడదగ్గ చిత్రం “సప్తగిరి ఎల్.ఎల్.బి”. సప్తగిరి పెర్ఫార్మెన్స్ విషయంలో కాస్త పరిణితి ప్రదర్శించి ఉంటే ఇంకాస్త పెద్ద హిట్ అయ్యేది.

రేటింగ్ : 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus