Sarangapani Jathakam Review in Telugu: సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • ప్రియదర్శి (Hero)
  • రూప కొడవయూర్ (Heroine)
  • శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, నరేష్, హర్ష చెముడు తదితరులు.. (Cast)
  • ఇంద్రగంటి మోహనకృష్ణ (Director)
  • శివలెంక కృష్ణప్రసాద్ (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • పి.జి.విందా (Cinematography)
  • Release Date : ఏప్రిల్ 25, 2025

“కోర్ట్” సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి హీరోగా నటించగా, ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన చిత్రం “సారంగపాణి జాతకం”. స్వచ్ఛమైన హాస్యంతో రూపొందిన చక్కని తెలుగు సినిమాగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు మేకర్స్. కాస్త డిలే అయినా.. ఎట్టకేలకు ఏప్రిల్ 25న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా? అనేది చూద్దాం..!!

Sarangapani Jathakam Review

కథ: ఉదయం లేవగానే “ఈరోజు ఏం జరుగుతుంది?” అని జాతకం చదివితే కానీ బెడ్ మీద నుంచి బయటికి రాని నవతరం కుర్రాడు సారంగపాణి (ప్రియదర్శి). ఎన్నాళ్లగానో ఇష్టపడుతున్న తన మేనేజర్ మైథిలి (రూప కొడవయూర్) తనను తానే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందాం అనేసరికి ఎగిరి గంతేసి మరీ ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు.

మరికొన్ని రోజుల్లో పెళ్లి అనగా.. సారంగపాణి జాతకంలో ఓ గీతలో చీకటి కోణం బయటపడుతుంది. ఆ గండాన్ని దాటకుండా పెళ్లి చేసుకుంటే లేనిపోని అనర్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో ఆ గండాన్ని స్నేహితుడు చందు (వెన్నెల కిషోర్) సహాయంతో దాటాలనుకుంటాడు.

ఇంతకీ ఆ గండం ఏమిటి? దాన్ని దాటడం కోసం సారంగపాణి చేసిన పిచ్చి పనులు ఏమిటి? ఆ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సారంగపాణి ఆ గండాన్ని దాటాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే “సారంగపాణి జాతకం”.

నటీనటుల పనితీరు: నటుడిగా ప్రియదర్శి ప్రతి పాత్రతో పరిణితి చెందుతున్నాడు. జాతకాల పిచ్చోడిగా అతడి పాత్ర కచ్చితంగా ఆకట్టుకుంటుంది. అయితే.. సైలెంట్ పంచులు లేదా ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వించడం బాగా అలవాటైన ప్రియదర్శి, ఇలా బాడీ లాంగ్వేజ్ తో నవ్వించడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు.

తెలుగమ్మాయి రూప కొడవయూర్ మైథిలి పాత్రలో సరిగ్గా సరిపోయింది. ఈ తరహా పాత్రల్లో తెలుగమ్మాయిలను తీసుకోవడం వల్ల పంచులు కానీ హావభావాలు కానీ ఎంత బాగా పండుతాయి అనేందుకు ఈ చిత్రంలో ఆమె నటన మంచి ఉదాహరణగా నిలుస్తుంది.

వెన్నెల కిషోర్ మరోసారి తనదైన కామెడీ తమింగ్ & డైలాగ్ డెలివరీతో విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆల్రెడీ ఇంద్రగంటి సినిమాలో నటించి ఉండడంతో.. బాడీ లాంగ్వేజ్ తో కామెడీ క్రియేట్ చేయడానికి కిషోర్ ఏమాత్రం ఇబ్బందిపడలేదు. ముఖ్యంగా ప్రాసలతో కూడిన పంచులు భలే పేలాయి.

హర్ష చెముడు వచ్చేది సెకండాఫ్ లో అయినప్పటికీ.. అతడి పాత్ర ద్వారా కామెడీ కూడా బాగా పండింది.

శ్రీనివాస్ అవసరాల పాత్ర నిజానికి సర్ప్రైజ్ ఎలిమెంట్ అవ్వాలి, కానీ.. అతడి పాత్రను డిజైన్ చేసిన తీరు కారణంగా అది అంతగా పేలలేదు. దాంతో ఆ పాత్ర ట్విస్ట్ కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే.. కొన్ని పంచులు మాత్రం పేలాయి.

నరేష్ & వడ్లమాని శ్రీనివాస్ పాత్రలు ఓ మోస్తరుగా నవ్వించాయి. మెచ్యూర్డ్ వైఫ్స్ రోల్స్ లో కల్పలత & రూపాలక్ష్మిలు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: వివేక్ సాగర్ సంగీతం ఎందుకో అవసరమైన స్థాయి మ్యాజిక్ క్రియేట్ చేయలేదు అనిపించింది. కనీసం పాటల చిత్రీకరణ విషయంలో కాస్త నవ్యత చూపించి ఉంటే బాగుండేది. నేపథ్య సంగీతం మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు. పిజి.విందా సినిమాటోగ్రాఫర్ గా ఇంద్రగంటికి ఎప్పడు తన బెస్ట్ ఇస్తాడు. ఈ కథకు, కథ స్కేల్ కు కావాల్సిన స్థాయి అవుట్ పుట్ ఇచ్చాడు ఈ చిత్రానికి కూడా. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాల టెర్రస్ సీక్వెన్స్ ను గ్రీన్ మ్యాట్ లో మ్యానేజ్ చేసిన విధానం బాగుంది.

ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్ టీమ్ కు పెద్దగా స్కోప్ లేదు. మోస్ట్లీ ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేసారు. దాంతో కాస్త బడ్జెట్ సేవ్ అయ్యిందనే చెప్పాలి.

దర్శకుడు ఇంద్రగంటి ఈ చిత్రాన్ని 1887లో పబ్లిష్ అయినటువంటి “లార్డ్ ఆర్థర్ సావిల్స్ క్రైమ్” (Lord Arthur Savile’s Crime) అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. మూలకథ మాత్రమే కాక స్క్రీన్ ప్లే, సందర్భాలు కూడా ఆ నవల లోనివే. ఆ ఆంగ్ల కథను తెలుగీకరించడంలో కచ్చితంగా విజయం సాధించాడు. అయితే.. కథనం విషయంలో మాత్రం ఇంకా పాత స్కూల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ లోనే ఉండిపోయారు. అందువల్ల.. కామెడీ పంచులు ఎంజాయ్ చేస్తున్నా, క్లైమాక్స్ లో వచ్చే కంగారు కామెడీని ఆస్వాదిస్తున్నా ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. ఆ విషయంలో ఇంద్రగంటి జాగ్రత్త తీసుకోవడం కంటే కాస్త అప్డేట్ అయితే బెటర్ అనిపించింది. ఇకపోతే.. ఎక్కడా అసభ్యతకు తావులేని డబుల్ మీనింగ్ పంచులు రాయడంలో మాత్రం అతడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేము. వీటన్నిటికీ మించి ఇంద్రగంటికి తెలుగు భాష మీద ఉన్న అభిమానాన్ని తన సినిమాల ద్వారా చాటుకునే విధానాన్ని మాత్రం ప్రశంసించాల్సిందే. ఇటువంటి దర్శకుల వల్లే తెలుగు సినిమాల్లో తెలుగు బ్రతుకుతుంది. ఓవరాల్ గా.. ఇంద్రగంటి దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారని చెప్పాలి.

విశ్లేషణ: డార్క్ హ్యూమర్ లు, డబుల్ మీనింగ్ డైలాగులు తాండవిస్తున్న ఈ తరుణంలో తెలుగులో ఓ స్వచ్ఛమైన కామెడీ ప్రేక్షకులకు అందించిన చిత్రం “సారంగపాణి జాతకం”. వెన్నెల కిషోర్, హర్ష చెముడు కామెడీ డైలాగ్స్ & క్యారెక్టర్ ను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అలాగే.. క్లైమాక్స్ 15 నిమిషాల్లో పండించిన సిచ్యుయేషనల్ కామెడీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే.. మందపాటిగా సాగే కథనం, సందర్భాన్ని మరీ ఎక్కువగా సాగదీయడం వంటివి ఈ చిత్రానికి చిన్నపాటి మైనస్ గా మారాయి. ఇంద్రగంటి మార్క్ హ్యూమర్ ను, స్వచ్ఛమైన తెలుగు భాషను ఇష్టపడేవారు, ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఆస్వాదించేవారు కచ్చితంగా చూడదగ్గ చిత్రం “సారంగపాణి జాతకం”.

ఫోకస్ పాయింట్: హాస్యం “ఇంద్ర”తేజోమయం.. కథనం “గంటి”కలం!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus