శేఖర్ కమ్ముల సినిమా అంటే నిడివి ఎక్కువ ఉంటుంది అని ఒక టాక్ ఉంది. ఫీల్ కోసమని పెద్ద పెద్ద సన్నివేశాలు రాసుకొని, తీస్తుంటారనే మాట కూడా ఉంది. అయితే ఇప్పటివరకు అలాం తీసిన సినిమాలు, సీన్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ‘లవ్‌స్టోరీ’లో కూడా అలాంటి సీన్స్ చాలా ఉన్నాయట. దీంతో సినిమా నిడివి బాగా ఎక్కువగానే వచ్చిందట. అన్నీ అనుకున్నట్లు సినిమా విడుదలైపోయుంటే ఈ మాటలేవీ వినిపించేవి కావు. కానీ ఇప్పుడు వాయిదా పడింది కాబట్టి… ‘లెంగ్త్’ విషయం ఇప్పుడు చర్చకు వస్తోంది.
కరోనా పరిస్థితులను ముందుగా ఊహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రబృందం ముందుగానే సినిమా విడుదలను వాయిదా వేసింది. లేదంటే ఈ నెల 16న సినిమా విడుదలైపోయేది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ అనుకోని గ్యాప్‌లో సినిమాను మరోసారి ఎడిట్ టేబుల్ మీదకు శేఖర్ కమ్ముల తీసుకొచ్చారట. సినిమా నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుంటుందేమో అని చూస్తున్నారట. మరోవైపు కొన్ని సీన్స్ విషయంలో కూడా కత్తెరకు పని చెబుతున్నారట. దీంతో సినిమా ఇంకాస్త ఆకట్టుకుంటుందని చిత్రబృందం అభిప్రాయం.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్‌స్టోరీ’. శేఖర్ కమ్ముల స్టైల్ లవ్ స్టోరీ అని ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ‘సారంగ దరియా…’ పాటతో సినిమాకు మరింత బజ్ ఏర్పడింది. ఆ పాట తీసుకొచ్చి క్రేజ్ ఒక పక్క అయితే, ఆ పాట తెచ్చిన వివాదం మరో రకంగా ప్రచారం కల్పించింది.