అనుష్క నటనకు గుడ్ బై చెప్పనుందా? బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోనుందా? .. మరి బాహుబలి తర్వాత సినిమాలు ఎందుకు ఎక్కువగా ఒప్పుకోలేదు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు గత కొంతకాలంగా ఆమె అభిమానులను వేధిస్తున్నాయి. వీటిపై అనుష్క స్పందన ఏమిటో తెలుసుకోవాలని మీడియా కూడా ఎదురుచూస్తోంది. ఇన్నాళ్లకి ఆ ప్రశ్నలకు సమాధానం దొరికింది. బాహుబలి కంక్లూజన్ ప్రమోషన్ తర్వాత ఇప్పుడు అనుష్క మీడియా ముందుకు వచ్చింది. అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా ప్రభాస్ గురించి సంచలన ప్రకటన చేసింది. “ప్రభాస్ నాకు కేవలం మంచి మిత్రుడు మాత్రమే. అతన్ని అన్నయ్య అని పిలవనేను. అందరు అబ్బాయిల్నీ మనం అన్నయ్యగా భావించలేం కదా?” అంటూ స్వీటీ వివరించింది.
సినిమాలు ఒప్పుకోకపోవడంపై స్పందిస్తూ.. “బాహుబలి’ తరువాత వరుసగా సినిమాలు చేయలేకపోయాను. ఎందుకంటే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాను. త్వరలో గౌతమ్ మేనన్తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను” అని చెప్పింది. ఇక చివరగా తన పెళ్లిపై మాట్లాడింది. “ఈ మధ్యకాలంలో అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు. నేనైతే పెళ్లి గురించి ఆలోచించడమే మానేశాను. నాకోసం మీరే ఓ మంచి అబ్బాయిని వెతికిపెట్టండి.” అంటూ చమత్కరించింది. బాహుబలి 2 తర్వాత అనుష్క నటించిన భాగమతి ఈ నెల 26 న రిలీజ్ కాబోతోంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.