పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన హీరోయిన్ దివ్యవాణి. సినిమాలకు చాలా కాలం క్రితమే గుడ్ బై చెప్పిన ఈమె రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నేతగా దివ్యవాణి క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యవాణి టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తెలుగు మహిళా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న దివ్యవాణి టాలీవుడ్ లో ఆడవాళ్లకు రక్షణ లేదని, అనేక అన్యాయాలకు గురవుతున్నారు అన్నారు.
అవసరాలు, అవకాశాల కోసం దిగజారే మనుషులు పరిశ్రమలో ఉన్నారని అన్నారు. సినిమా అవకాశాల కోసం అనేక పైరవీలు జరుగుతాయని ఆమె విమర్శించారు. ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ పట్ల పరిశ్రమ వివక్షత చూపుతుందన్న అర్థంలో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రకుల్ ప్రీత్ కి అవకాశాలు ఇస్తున్న పరిశ్రమ ప్రణీతకు ఎందుకు ఇవ్వడం లేదు అన్నారు. రకుల్ కి ఉందేమిటి, ప్రణీతకు లేనిదేమిటీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవకాశాలు ఇవ్వడం వెనుక అనేక కారణాలు ఉంటాయని ఆమె నర్మగర్భంగా మాట్లాడారు.
టాలీవుడ్ డ్రగ్ కల్చర్ పై కూడా దివ్యవాణి ధ్వజమెత్తారు. పెద్ద కుటుంబాలకు చెందిన పిల్లలకు డ్రగ్స్ అలవాటు ఉందని ఆమె ఆరోపించారు. రెండేళ్ల క్రితం టాలీవుడ్ లో వెలుగు చూసిన డ్రగ్ కేసుపై విచారణ ఎంత వరకూ వచ్చిందో తెలంగాణా ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు.