ప్రముఖ తమిళ నటుడు. దర్శకుడు జె మహేంద్రన్(79) ఈరోజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ గత కొంత కాలంగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఈయన ఈరోజు ఉదయం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన కొడుకు జాన్ మహేంద్రన్ ఈ విషయాన్నీ వెల్లడించారు. తమిళంలో చాలా సూపర్ హిట్ చిత్రాలని డైరెక్ట్ చేసిన మహేంద్రన్.. శంకర్, మణిరత్నం వంటి అగ్రదర్శకులకి.. మార్గదర్శకుడుగా నిలిచారు.
ఈయన డైరెక్షన్లో వచ్చిన ‘ముల్లుమ్ మలరుమ్’, ‘జానీ’, ‘నెంజతై కిల్లాడే’ వంటి చిత్రాలు మహేంద్రన్‌కి ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. నటుడిగాను కూడా పలు చిత్రాలల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇటీవల వచ్చిన విజయ్’పోలీస్’, విజయ్ సేతుపతి ‘సీతాకాతి’, రజనీకాంత్ ‘పేటా’ , ‘బ్యూమ్రాంగ్’ వంటి చిత్రాల్లో కొన్ని కీలక పాత్రలు పోషించారు. 2018లో ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డును కూడా అందుకున్నారు మహేంద్రన్. ఈయన మరణంతో తమిళ సినీ ఇండస్ట్రీకి తీరని లోటని కొందరు సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండీ ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహేంద్రన్ మరణంతో కోలీవుడ్ మొత్తం విషాద ఛాయలు నెలకొన్నాయి.