దర్శకుడు మారుతి సారథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ “3 రోజెస్”. మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నిర్మాత ఎస్.కె.ఎన్ సెకండ్ సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సీజన్ లో రాశి సింగ్, కుషిత కొత్త రోజాలుగా కనిపించారు. మరి ఈ రెండో సీజన్ మొదటి సీజన్ ను మించి ఉందా? ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? అనేది చూద్దాం..!!

కథ: పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రితిక (ఈషా రెబ్బా) హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అవుతుంది. అక్కడ మరో ఇద్దరు అమ్మాయిలు మేఘన (రాశి సింగ్), సృష్టి (కుషిత)తో కలిసి ఒక యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తుంది.
ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వాటి నుండి ఎలా బయటపడ్డారు? అనేది సీజన్ 2 సారాంశం.

నటీనటుల పనితీరు: కుషిత ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మాత్రమే అందరికీ తెలుసు. నటిగా ఆమె ఏం చేస్తుందిలే అనుకున్నారు చాలా మంది. అయితే.. ఈ సిరీస్ లో ఆమె తన సత్తా ఏమిటి అని చాటుకుంది. తింగరి బుచ్చిలా కనిపిస్తూనే, మెచ్యూరిటీ ప్రదర్శించింది.
ఈషా రెబ్బా కామెడీ & సెన్సిబిలిటీని బ్యాలెన్స్ చేసిన విధానం ఆమె సీనియారిటీని నిరూపించింది. ముఖ్యంగా వైవా హర్ష కాంబినేషన్ సీన్స్ లో ఈషా నటన భలే ఆకట్టుకుంటుంది. వైవా హర్ష సీజన్ లో రెచ్చిపోయి మరీ నవ్వించాడు. సదరు సందర్భాలు ఆల్రెడీ చూసేసిన భావన కలిగించినా.. వైవా హర్ష స్క్రీన్ ప్రెజన్స్ వల్ల బాగుంది అనిపిస్తుంది.
రాశి సింగ్ అందం, అభినయం చక్కగా ప్రదర్శించింది. రాశి-సత్య కాంబినేషన్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యింది. పిసినారి మొగుడిగా సత్య కామెడీ పంచులు గట్టిగా పేలాయి.
పూర్ణ సెకండ్ సీజన్ కి లీడ్ ఇవ్వడంలో బాగా హెల్ప్ అయ్యింది. సుదర్శన్, సురభి ప్రభావతి, ప్రభాస్ శ్రీను, ఇనాయ సుల్తానాలు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతికవర్గం పనితీరు: క్వాలిటీ పరంగా చాలా డీసెంట్ ప్రొడక్ట్ ఇది. తక్కువ లొకేషన్స్ తో మ్యానేజ్ చేయడానికి ప్రయత్నించడం వల్ల.. రిచ్ గా కనిపించదు కానీ, సినిమాటోగ్రఫీ వర్క్ వల్ల క్వాలిటీ బాగా వచ్చింది.
కలరింగ్ విషయంలో మరీ బ్రైట్ టోన్ కి వెళ్లిపోయారు. అలా కాకుండా ఎమోషన్ కి తగ్గట్లుగా ఉంటే బాగుండేది.
దర్శకుడు కిరణ్ అవకాశం ఉంది కదా అని హీరోయిన్లతో అనవసరమైన ఎక్స్ పోజింగులు, బూతు లేదా డబుల్ మీనిగ్ డైలాగులు చెప్పించకుండా.. డీసెంట్ & బ్యూటిఫుల్ గా కథను నడిపిన విధానం ప్రశంసనీయం. అయితే.. సరైన ముగింపు లేకుండా సిరీస్ ను ముగించడం అనేది సంతృప్తినివ్వలేకపోయింది. మరి మూడో సీజన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి.. ఆ వచ్చేలోపు కనీసం ఇంకో ఎపిసోడ్ రిలీజ్ చేసి, క్యారెక్టర్ జర్నీకి మంచి క్లోజర్ ఇస్తే బెటర్.

విశ్లేషణ: హుందాగా కనిపించే గ్లామర్, కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు, ప్రస్తుత జనరేషన్ రిలేట్ అయ్యే పాత్రలు, సందర్భాలు అన్నీ కలిసి “3 రోజెస్: సీజన్ 2”ని ఒక డీసెంట్ వెబ్ సిరీస్ గా నిలిపాయి. మొదట పేర్కొన్నట్లుగా.. సరైన క్లోజర్ ఇచ్చి ఉంటే, ఇంకాస్త బెటర్ ఫీల్ ఉండేది. హిందీలో “ఫోర్ మోర్ షాట్స్” లాంటి సిరీస్ లకు దీటుగా ఈ “3 రోజెస్” ఉందని మాత్రం చెప్పొచ్చు. 6 ఎపిసోడ్లతో ఆహా యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ ను ఓ లెక్కేయండి.

ఫోకస్ పాయింట్: నవతరం యువతుల కథ!
రేటింగ్: 3/5
