సినిమా థియేటర్లు కష్టాల్లో ఉన్నాయి. ఓటీటీ, యూట్యూబ్, సోషల్ మీడియా వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల జనం థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. మల్టీప్లెక్స్‌లో ఒక సాధారణ కుటుంబం సినిమా చూడాలంటే టిక్కెట్లు, స్నాక్స్ కలిపి రూ.3000-5000 ఖర్చు అవుతోంది. ఒక్కో టిక్కెట్ రూ.200-500 మధ్య ఉండగా, కోలా, పాప్‌కార్న్ వంటి వాటికి అదనపు ఖర్చు తోడవుతోంది. దీంతో మధ్యతరగతి కుటుంబాలు ఓటీటీల వైపు మొగ్గుతున్నాయి. ఈ క్రైసిస్ నుంచి థియేటర్లను కాపాడేందుకు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఓ సరికొత్త ఆలోచన వెల్లడించాడు.
ముంబైలో జరిగిన ‘వేవ్స్ 2025’ సమ్మిట్‌లో మాట్లాడిన షారుఖ్ (Shah Rukh Khan), థియేటర్ టిక్కెట్ ధరలను రూ.100 లోపు నిర్ణయిస్తే జనం తిరిగి థియేటర్లకు వస్తారని అన్నాడు. చిన్న పట్టణాల్లో తక్కువ ఖర్చుతో సాధారణ థియేటర్లను నిర్మిస్తే, ఎక్కువ మంది సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. ఈ విధానం థియేటర్ రంగాన్ని కాపాడడమే కాక, సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం మెట్రో నగరాల్లోనే మల్టీప్లెక్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. కానీ, చిన్న పట్టణాల్లో థియేటర్ల సంఖ్య పెంచాలని, చైనా మోడల్‌ను అనుసరించాలని షారుఖ్ సూచించాడు. చైనాలో లాంటి తక్కువ ధరల థియేటర్లు ఎక్కువగా ఉండటం వల్ల జనం సినిమాలకు ఆకర్షితులవుతున్నారని ఆయన చెప్పాడు. తక్కువ ధరలకు సినిమాలను అందిస్తే, ఓటీటీలతో పోటీపడుతూ థియేటర్లకు జనాలను రప్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.
షారుఖ్ సూచనలు థియేటర్ రంగంలో కొత్త చర్చకు తెరతీశాయి. తక్కువ ధరల టిక్కెట్లతో ఎక్కువ మందిని థియేటర్లకు ఆకర్షించడం సాధ్యమైతే, భారతీయ సినిమా రంగం మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. ఈ ఆలోచనను ఇండస్ట్రీ ఎలా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సినిమా ప్రియులు కూడా ఈ సరికొత్త ప్రతిపాదనపై ఆశలు పెట్టుకున్నారు.