“దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం” సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన నాని (Nani), సెకండ్ హ్యాట్రిక్ కొట్టేందుకు “హిట్ 3”తో సిద్ధమయ్యాడు. హిట్ యూనివర్స్ లో మూడో సినిమా ఇది. “సైంధవ్” డిజాస్టర్ అనంతరం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, నాని తన రెగ్యులర్ ఇమేజ్ కి భిన్నంగా ఫుల్ లెంగ్త్ బ్లడీ యాక్షన్ చేసిన సినిమా కావడం, టీజర్ & ట్రైలర్ విశేషమైన అంచనాలను నమోదు చేసి ఉండడంతో “హిట్ 3” (HIT 3) మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి నాని రిస్క్ ఎలాంటి ఫలితాన్నిచ్చింది? అనేది చూద్దాం..!!
కథ: ఇండియా మొత్తం ఒకే రకమైన మర్డర్స్ జరుగుతుంటాయి. అందర్నీ ఒకే విధమైన టెక్నిక్ తో చంపడం, ఆ వీడియోలు డార్క్ వెబ్ లో అప్లోడ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఈ కేస్ ను హ్యాండిల్ చేయడం కోసం రంగంలోకి దిగుతాడు అర్జున్ సర్కార్ (నాని).
ఎవరీ కల్ట్ గ్యాంగ్? వాళ్ల ఇంటెన్షన్ ఏమిటి? ఎందుకీ హత్యలు చేస్తున్నారు? వాటిని అర్జున్ సర్కార్ ఎలా ఆపగలిగాడు? అనేది “హిట్: ది థర్డ్ కేస్”(HIT 3) కథాంశం.
నటీనటుల పనితీరు: నాని తనలోని సరికొత్త యాంగిల్ ను పరిచయం చేసే ప్రయత్నం ఇది. మాస్ తోపాటు ఒక పీక్ వయొలెంట్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేసాడు. నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమా అయితే కచ్చితంగా కాదని ఆల్రెడీ టీజర్, ట్రైలర్ తోనే చెప్పుకొచ్చాడు. స్ట్రాంగ్ ఎమోషన్ తోపాటు పోరాట పటిమను కూడా గట్టిగానే ప్రదర్శించాడు.
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) పాత్రను ఆసక్తికరంగా డిజైన్ చేసినప్పటికీ.. సెకండాఫ్ లో ఆమె క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా కాక, ఒక రెగ్యులర్ అమ్మాయిలా ప్రాజెక్ట్ చేయడం ఆ పాత్ర వెయిటేజ్ ను కిల్ చేసింది.
ప్రతీక్ బబ్బర్ పాత్రను డిజైన్ విధానం బాగున్నా.. ఆ పాత్ర గోల్ ఏంటి, టార్గెట్ ఏంటి? ఎందుకలా బిహేవ్ చేస్తుంది? వంటి ప్రశ్నలకు ఎక్కడా సరైన సమాధానాలు చెప్పలేదు. అందువల్ల పాత్ర క్రూరత్వం అనేది సరిగా ఎస్టాబ్లిష్ కానీ ఎలివేట్ కానీ అవ్వలేదు.
సపోర్టింగ్ రోల్స్ లో కోమలి ప్రసాద్ కి మంచి పాత్ర లభించింది. ఇంకొన్ని సర్ప్రైజింగ్ రోల్స్ ఉన్నాయి. వాటి ప్లేస్మెంట్ బాగున్నప్పటికీ ఎక్కడో చిన్న వెలితి.
సాంకేతికవర్గం పనితీరు: యాక్షన్ బ్లాక్స్ ను డిజైన్ అండ్ కంపోజ్ చేసిన విధానం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. చివరి 20 నిమిషాల సీక్వెన్స్ మంచి కిక్ ఇచ్చింది. రియల్ సతీష్ ను అందుకు మెచ్చుకోవాలి కానీ.. సినిమాలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ను ప్రీరిలీజ్ పార్టీలో లీక్ చేసి, సదరు సర్ప్రైజ్ లకి ఆడియన్స్ థ్రిల్ అవ్వలేకపోవడానికి కారణం అయినందుకు మాత్రం అతడ్ని తిట్టుకోవాల్సి వచ్చింది.
సాను వర్గీసి సినిమాటోగ్రఫీ వర్క్, ఫ్రేమింగ్స్ సినిమాని సరికొత్తగా ప్రెజంట్ అయ్యేలా చేసింది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్ లో ఆరెంజ్, రెడ్ లైట్ కాంబినేషన్ లో తెరకెక్కించిన విధానం సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. అయితే.. సినిమాలో గ్రద్ద కనిపించినప్పుడల్లా సీజీఐ అని పదే పదే కాషన్ వేయడం మాత్రం డిస్ట్రబింగ్ గా ఉంది.
ప్రొడక్షన్ నాగేంద్ర వర్క్ ను మెచ్చుకోవాలి. ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడాన్ని, రక్తం, బాడీ పార్ట్స్, ఇంటెన్స్ బ్లడ్ స్పోర్ట్స్ ను క్రియేట్ చేసి.. సినిమాకి ఒక కొత్త యాంగిల్ ఇచ్చాడు. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు అని స్పష్టమవుతుంది. ఫ్రేమ్స్ అన్నీ రిచ్ గా ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ ఇన్విస్టిగేషన్ ప్రొసీజర్ అండ్ పోలీస్ స్టేషన్ లొకేషన్స్ విషయాల్లో ఆ ఖర్చు ఎలివేట్ అయ్యింది.
దర్శకుడు శైలేష్ కొలను ఒక కల్ట్ ను క్రియేట్ చేయాలనుకున్న ఆలోచన బాగున్నప్పటికీ.. ఆ కల్ట్ బిహేవియర్ ను సరిగా డిజైన్ చేసుకోలేదు. ఇదే తరహా కల్ట్ ని ఇంతకుమునుపు చంద్రశేఖర్ ఏలేటి “అనుకోకుండా ఒకరోజు” చిత్రంలో చూపించాడు, అది చాలా సహజంగా ఉంటుంది. కానీ.. “హిట్ 3” విషయంలో మాత్రం ఆ కల్ట్ అనేది సరిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. మరీ ముఖ్యంగా సినిమాలో బ్యాగ్రౌండ్ ఆర్టిస్టులు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, వాళ్ల ఎక్స్ ప్రెషన్స్ ఎంత క్రూషియల్ అనేది ఈ సినిమా నిరూపించింది. ఆ విషయంలో శైలేష్ ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. హిట్ యూనివర్స్ ను, మార్వెల్ యూనివర్స్ స్థాయిలో ఎలివేట్ చేసిన విధానం మాత్రం బాగుంది. అలాగే.. ప్రతి విషయాన్ని ఎవర్ గా ఎక్స్ప్లేన్ చేయకుండా, సింపుల్ డీటెయిల్స్ తో ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఉదాహరణకి హీరో పాత్ర రేడియో కమ్యూనికేషన్ లో స్పెషలిస్ట్ అనే విషయాన్ని సింపుల్ గా ఎలివేట్ చేసిన విధానం.
క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు శైలేష్, ఆ తరహాలో చాలా సన్నివేశాలను కూడా చాలా చక్కగా రాసుకున్నాడు. ఆ సెకండాఫ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అయితే కచ్చితంగా “హిట్: ది ఫస్ట్ కేస్” స్థాయిలో మాత్రం లేదు.
విశ్లేషణ: కొన్ని సినిమాలు ఒక కొత్త దారిని సృష్టిస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే డార్క్ హ్యూమర్ కి అలవాటుపడుతున్నారు. అలాంటిది ఈ తరహా సర్వైవల్ థ్రిల్లర్స్ అలవాటుపడడానికి చాలా సమయం పడుతుంది. “హిట్ 3” (HIT 3) ఆ క్రమంలో తొలి మెట్టు అనే చెప్పాలి. నాని ఇమేజ్ కు ప్రాపర్ ఛేంజోవర్ ఇచ్చింది కానీ.. పూర్తిస్థాయి సంతృప్తి ఇవ్వలేకపోయింది. అయితే చిన్న పాప ఎమోషనల్ సీన్ మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది. నాని కెరీర్ కి “హిట్ 3” ఒక మైలురాయి చిత్రంగా, తెలుగులో బ్లడీ యాక్షన్ సినిమాలకి ఒక బాట వేసింది.
ఫోకస్ పాయింట్: నాని బ్లడ్ పెట్టి చేసిన హిట్టు సినిమా!
రేటింగ్: 3/5