బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తన తనయుడు ఆర్యన్ ఖాన్ ను చూడడానికి తొలిసారి జైలుకి వచ్చారు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకి బుధవారం ఆయన తనయుడిని కలిసి కాసేపు మాట్లాడి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసుల అదుపులో ఉన్న ఆర్యన్ ను షారుఖ్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఈ నెల అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూజ్ షిప్ పై దాడి చేసిన పోలీసులు షారుఖ్ కుమారుడితో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
ఈ దాడిలో పోలీసులు నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆర్యన్ పలుమార్లు బెయిల్ కి అప్లై చేయగా.. కోర్టు మాత్రం రిజెక్ట్ చేస్తూ వస్తోంది. బుధవారం నాడు మరోసారి ఆర్యన్ కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ఆర్యన్ కు మళ్లీ బెయిల్ రద్దవ్వడంతో తనయుడిని చూసుకోవడానికి షారుఖ్ ఖాన్ ఆర్ధర్ రోడ్డు జైలుకి వచ్చినట్లు సమాచారం. గతవారం షారుఖ్ తో పాటు అతడి భార్య గౌరీ ఖాన్ జైలులో ఉన్న ఆర్యన్ తో వీడియో కాల్ మాట్లాడిన సంగతి తెలిసిందే.
అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన నిబంధనలను సడలించింది. దీంతో జైలులో ఉన్న వ్యక్తులు తమ కుటుంబసభ్యులను కలుసుకోవడానికి వెసులుబాటు కల్పించారు . ఈ క్రమంలో షారుఖ్, ఆర్యన్ ను కలుసుకోవడానికి వచ్చారు.