శంకర్ హీరోగా శ్రీధర్ ఎన్. దర్శకత్వంలో ఎస్. కె. పిక్చర్స్ సమర్పణలో ఆర్.ఆర్ . పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న `శంభో శంకర` చిత్రం తాజాగా షూటింగ్ పూర్తిచేసుకుంది. కాగా సోమవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన రమణారెడ్డి మాట్లాడుతూ, ` షూటింగ్ అంతా అనుకున్న ప్రకారం..అనుకున్న సమయంలో పూర్తిచేసాం. టాకీ పార్టుతో పాటు, మూడు ఫైట్లు చాలా అద్భుతంగా వచ్చాయి. పాటలన్నీ ఏటికవి ప్రత్యేకంగా ఉంటాయి. పాటల చిత్రీకరణ చాలా బాగా జరిగింది. దర్శకుడు మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చారు` అని అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీధర్ ఎన్. మాట్లాడుతూ, ` నాకిది తొలి సినిమా అయినా నిర్మాతలు సహకారంతో అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను. సాయి కార్తీక్ సంగీతం సినిమాకు హైలైట్ గా ఉంటుంది. కొరియో గ్రాఫర్స్ భాను మాస్టర్, గణేష్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫైట్స్ మాస్టర్స్ జాష్వా, నందు కంపోజ్ చేసిన ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఆ ఫైట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది` అని అన్నారు.
మరో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` ఇప్పటివరకూ కమెడీయన్ గా అన్ని చిత్రాల్లో ప్రధాన భూమికను పోషించిన శంకర్ నట విశ్వరూపం ఈ శంభో శంకర చిత్రం ద్వారా ప్రేక్షకులు చూడబోతున్నారని కచ్చితంగా చెప్పగలను. అగ్ర కథానాయకులకు ఏ మాత్రం తగ్గకుండా శంకర్ నటించాడు. అతను చేసిన ఫైట్స్, డాన్సులు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. శంకర్ కోసం మళ్లీ మళ్లీ థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారు. అలాగే శంకర్ తన స్టైల్ కామెడీతో అలరించడమే కాకుండా, సెంటిమెంట్ సన్నివేశాల్లో ఆడవాళ్లనే కాకుండా మగవాళ్లచే కూడా కంటతడి పెట్టిస్తాడు. చాలా అద్భుతంగా నటించాడు. అన్ని పనులు పూర్తిచేసి వచ్చే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం` అని అన్నారు.