శరత్ మరార్ ప్రస్తుత “కర్తవ్యం” అదే!

  • November 23, 2017 / 07:23 AM IST

పవన్ కళ్యాణ్ తో వరుసబెట్టి “గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు” లాంటి హై బడ్జెట్ అండ్ సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలు రూపొందించినా రాని లాభాలు కేవలం ఒక్క డబ్బింగ్ సినిమాతో పొందాడు శరత్ మరార్. అందుకే ఇకపై స్ట్రయిట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే బెటర్ అంటూ తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలపై కాన్సన్ ట్రేషన్ మొదలెట్టాడు. ఇటీవల తమిళంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న “అరమ్” అనే చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు శరత్ మరార్. తమిళనాట నయనతార కథానాయికగా రూపొందిన ఈ చిత్రంలో ఆమె కలెక్టర్ గా నటించడం విశేషం. బోరు బావుల నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో ఎన్నడూ లేని విధంగా నయనతార స్పెషల్ కేర్ తీసుకొని రిలీజయ్యాక థియేటర్స్ సందర్శించడం తమిళ సినీవర్గాల్లో చిన్నసైజు సంచలనం సృష్టించింది. అంతటి క్రేజ్ సొంతం చేసుకొన్న ఈ చిత్రాన్ని తెలుగులో “కర్తవ్యం” అనే పేరుతో విడుదల చేయనున్నారు.

శరత్ మరార్ రెండు వారాల క్రితం విడుదలైన “అదిరింది” పేరుకు తగ్గట్లే భారీ కలెక్షన్స్ విషయంలోనూ అదరగొడుతూ విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే “కర్తవ్యం” చిత్రాన్ని కూడా భారీ సంఖ్యలో విడుదల చేయనున్నారు శరత్ మరార్. చూస్తుంటే.. శరత్ మరార్ ఇకపై స్ట్రయిట్ సినిమాలు రూపొందించడం మొత్తానికి మానేసి “లక్ష్మీ గణపతి ఫిలిమ్స్” తరహాలో డబ్బింగ్ సినిమాలు మాత్రమే విడుదల చేస్తూ సెటిల్ అయిపోటారేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus