నేటితరం ప్రేక్షకులను అలరించాలంటే కొత్తదనం ఉండాలి. స్టార్ హీరో అయినా.. యువ హీరో అయినా విభిన్నంగా కనిపించాల్సిందే. కష్టపడకుంటే పోటీలో వెనుకపడిపోవడం గ్యారంటీ. అందుకే శర్వానంద్ కొత్త కాన్సెప్ట్ లను స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మహానుభావుడు విజయం ఇచ్చిన ఉత్సాహంతో రిస్క్ చేస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్, హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. 20 ఏళ్ల యువకుడిగాను.. 40 ఏళ్ల వ్యక్తిగాను రెండు భిన్న పాత్రలలో మెప్పించనున్నారు. ఈ తరహాలో శర్వానంద్ గతంలో “మళ్లీ మళ్లీ ఇది రాని రోజు” సినిమా చేశారు. అప్పుడు బాడీలో పెద్దగా తేడా చూపించలేదు. నటనలో మాత్రమే వైవిధ్యం చూపించారు.
ఈ సినిమాలో మాత్రం నటనలో మాత్రమే కాకుండా రూపంలో కూడా చాలా తేడా చూపించనున్నారు. 20 ఏళ్ల యువకుడిగా కనిపించేందుకు పది కిలోల బరువు తగ్గారు. యంగ్ లుక్ కి తోడు పోనీ టెయిల్‌తో స్టైలిష్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కత్తాలో జరుగుతోంది. అక్కడ యంగ్ శర్వానంద్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత నేపాల్‌లో శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించే సీన్స్‌ను షూట్ చేయనున్నారు. ఆ 40 ప్లస్ పాత్ర కోసం శర్వానంద్ మరింత బరువు పెరగనున్నారు. ఇలా తక్కువ సమయంలో బరువు తగ్గి, పెరగడం ఆరోగ్యానికి హానికరం. అయినా క్యారక్టర్స్ కోసం ఈ సాహసం చేస్తున్నారు.