ఆ సూపర్‌ స్టార్స్ అంతా ఎక్కడున్నారు ?

మనదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలని కుదిపేస్తున్న అంశం “మీటూ”. సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయని.. ఇదివరకు లైంగిక ఒత్తిడులు ఎదుర్కున్న నటీమణులు దైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నారు. దీంతో ఇది ఉద్యమంలా మారింది. ఇంత జరుగుతున్నా “మీటూ” ఉద్యమానికి ఏ ఒక్క స్టార్ హీరో మద్దతు తెలపలేదు. బాధితులకు అండగా ఉంటామని, అటువంటివి మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రకటన కూడా చేయలేదు. దీనిపై కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ స్పందించింది. కన్నడలో యూ టర్న్ సినిమా ద్వారా పాపులర్ అయిన ఈమె దేవదాస్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. మన్మధుడు నాగార్జునకి జోడీగా నటించి పేరు తెచ్చుకుంది.

ఇప్పుడు “మీటూ” విషయంలో స్టార్ హీరోల వైఖరిని వ్యంగ్యంగా ప్రశ్నించి వార్తల్లో నిలిచింది. “70 ఎమ్ ఎమ్ స్క్రీన్ మీద తన అక్క చెల్లెళ్లని, మహిళలను వేధించే విలన్‌ల భరతం పడతారు. డజన్ల కొద్దీ రౌడీలను, భారీ ట్రక్కులను గాల్లోకి విసిరేస్తారు. ఆ సూపర్‌స్టార్‌లంతా ఎక్కడున్నారు. ఇప్పుడు కూడా మీరు మ్యాజిక్ చేయండి. సమస్యపై స్పందించండి. మన సూపర్ హీరోల ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నా అంతే..”అంటూ శ్రద్ధ ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ కన్నడ పరిశ్రమలోనే కాకుండా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడైనా హీరోలు స్పందించకపోతే బాగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus