జర్నలిస్టులు ఇలాంటి ప్రశ్నలు అడగడం మానేయాలి : శ్రియా శరణ్

హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టి 18 ఏళ్లవుతుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 90 సినిమాల్లో నటించింది. ఇన్నాళ్లుగా ఎంతోమంది కొత్త హీరోయిన్లొచ్చారు, అయినా నిలదొక్కుకుంది. ప్రత్యేక పాత్రలు మొదలుకొని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక హీరోయిన్ గా ఆమె కెరీర్ అయిపోయింది అనుకొనే టైమ్ కి మళ్ళీ మంచి సినిమాతో రీఎంట్రీ ఇచ్చి తన స్టామినా చాటుకొంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవి కాకుండా ఇంకొన్ని సినిమాలు ప్రీప్రొడక్షన్ లో ఉన్నాయి. ఆ క్రేజీ కథానాయిక మరెవరో కాదు శ్రియా శరణ్. 35 ఏళ్ల ఈ వయ్యారి తాజాగా తెలుగులో “గాయత్రి” సినిమాలో కీలకపాత్ర పోషించింది. మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మదన్ దర్శకుడు. ఫిబ్రవరి 9న విడుదలవుతున్న ఈ చిత్రం గురించి, తన భవిష్యత్ సినిమాల గురించి శ్రియ శరణ్ చెప్పిన విషయాలు-విశేషాలు మీకోసం..!!

అమాయకురాలైన పల్లెటూరి యువతి..
“గాయత్రి” చిత్రంలో నా పాత్ర చాలా సెన్సిబుల్ గా ఉంటుంది. పల్లెటూరి యువతిగా కనిపిస్తాను. పాత్రలో అమాయకత్వంతోపాటు అపారమైన పట్టుదల కూడా ఉంటుంది. సినిమా మొత్తం కనిపించను కానీ.. నా పాత్ర ప్రభావం సినిమా మీద చాలా ఉంటుంది. కథలో కీలకమైన మలుపు తీసుకొచ్చే పాత్ర నాది.

మోహన్ బాబు గారి సినిమాలో నటించలేదనే బాధ ఉండకూడదని..
తెలుగులో ఇప్పటివరకూ అందరు స్టార్ హీరోలతో కలిసి నటించాను. అయితే.. ఒక్క మోహన్ బాబు గారితో కలిసి కానీ ఆయన సినిమాలో కానీ నటించే అవకాశం రాలేదని అనుకొంటుండేదాన్ని. అలాంటి సమయంలో మదన్ వచ్చి “గాయత్రి” కథ చెప్పడంతో వెంటనే అంగీకరించాను. ఈ సినిమాతో నా ఆశ తీరింది.

కాస్ట్యూమ్ డిజైనర్ ను మెచ్చుకోవాల్సిందే..
“గాయత్రి” చిత్రంలో నా క్యారెక్టర్ లుక్ అంత నేచురల్ గా ఉండడానికి ముఖ్యకారణం కాస్ట్యూమ్ డిజైనర్. హైద్రాబాదీ అయిన అతడు ప్రతి డీటెయిల్ విషయంలో జాగ్రత్త తీసుకొని చాలా సహజంగా ఉండేలా డిజైన్ చేశాడు. కాటన్ శారీస్ మొదలుకొని ఇయర్ రింగ్స్ వరకూ ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొన్నాడు.

దర్శకులు-రచయితల తీరు మారింది..
నా కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన పాత్రలతో పోల్చుకుంటే ఇప్పుడొస్తున్న పాత్రలు నాకు బాగా నచ్చుతున్నాయి. దర్శకుల తీరు మారుతుంది, రచయితలు కూడా సరికొత్త పాత్రలు రాస్తున్నారు. అందుకు నిదర్శనం నేను నటిస్తున్న కొత్త సినిమాలే. ప్రతి సినిమాలోని పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటాయి. ఈ పాత్రలను నేను ఎంజాయ్ చేస్తున్నాను.

ఇలాంటి క్వశ్చన్స్ అడగడం మానేయాలి..
గత అయిదారేళ్లుగా చూస్తున్నాను. నా ఏ సినిమా ప్రమోషన్ కి వచ్చినా అందరూ కాకపోయినా ఎవరో ఒకరైనా అడిగే క్వశ్చన్స్ లిస్ట్ లో తప్పకుండా ఉండే ప్రశ్న “ఇంకా ఆఫర్లు ఎలా వస్తున్నాయి?/ఇంకా హీరోయిన్ గా ఎలా సర్వైవ్ అవుతున్నారు?”. అసలు ఒక నటిని ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు. హాలీవుడ్ లో మెరిల్ స్ట్రీప్ 60 ఏళ్ళు వచ్చినా కూడా నటిస్తూనే ఉంది. ఆవిడను ఎవరూ అలాంటి క్వశ్చన్స్ అడగరు కదా. అందుకే మీడియా మిత్రుల ఆలోచనాధోరణి మారాలి, ఇకపైనైనా ఇలాంటి ప్రశ్నలు అడగరని ఆశిస్తున్నాను.

నాకైతే ఒక్క బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కూడా లేదు..
ప్రస్తుతం ఇండస్ట్రీ గురించి బయట రకరకాలుగా మాట్లాడుకొంటున్నారు. కానీ.. నాకైతే పర్సనల్ గా ఇప్పటివరకూ ఇండస్ట్రీలో ఒక్క బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ కూడా లేదు. అందరూ నా టాలెంట్ ను మాత్రమే గుర్తించి ఆఫర్లు ఇచ్చారు. అందుకే ఇండస్ట్రీ అంటే అమితమైన గౌరవం.

నాకైతే విష్ణుతో నటించిన విషయం గుర్తులేదు..
మీరు అడిగే వరకూ నేను “గేమ్” అనే సినిమాలో విష్ణుతో కలిసి ఒక క్యామియో రోల్ ప్లే చేశాననే విషయం కూడా గుర్తులేదు. అంటే చాలా ఏళ్ల క్రితం చేసిన సినిమా అది కూడా రెండు నిమిషాల క్యారెక్టర్ కావడంతో నాకు అస్సల గుర్తురాలేదు. కానీ.. విష్ణుతో కలిసి నటించడం అనేది ఎంజాయ్ చేశాను.

ఆ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాను..
ప్రస్తుతం తెలుగులో “వీరభోగ వసంతరాయులు” అనే సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నేను ఎయిర్ హోస్టెస్ గా నటిస్తున్నానని వచ్చిన వార్తలు చదివి నేను కూడా నవ్వుకున్నాను. నాగురించి తప్పుగా ఏమీ రాయలేదు కానీ అంత కష్టపడి నేనేదో ట్రయినింగ్ కూడా తీసుకొన్నానని రాయడం మాత్రం కామెడీగా అనిపించింది. అయితే.. ఈ సినిమాలో నేను ఒక పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాను.

18 ఏళ్ల కెరీర్ లో కేవలం ఇద్దరితోనే..
నా 18 ఏళ్ల కెరీర్ లో నేను 90 సినిమాల్లో నటించగా ఇప్పటివరకూ కేవలం ఇద్దరు లేడీ డైరెక్టర్స్ తో కలిసి వర్క్ చేశాను. అప్పుడప్పుడూ నాకే అనిపిస్తుంటుంది ఇండస్ట్రీలో తెలుగు టెక్నీషీయన్స్ ఎందుకు లేరు అని. కానీ నేనేం చేయగలను ఆలోచించడం తప్ప.

కుర్ర డైరెక్టర్లు ఆశ్చర్యపరుస్తున్నారు..
ప్రస్తుతం నేను తమిళంలో కార్తీక్ నరేన్ అనే యువ దర్శకుడి నేతృత్వంలో తెరకెక్కుతున్న “నరగాసురన్” అనే సినిమాలో నటిస్తున్నాను. ఆ కుర్రాడి వయసు 22 ఏళ్ళు, అలాగే “వీరభోగ వసంతరాయులు” డైరెక్టర్ కూడా 25 ఏళ్ల లోపు కుర్రాడే. వాళ్ళ టేకింగ్ చూస్తుంటే మతి పోతుంది. అంత కన్విక్షన్ తో ఆ ఏజ్ లో సినిమాలు ఎలా తీస్తున్నారో అని ఆశ్చర్యపడుతుంటాను.

తదుపరి సినిమాల వివరాలు..
హిందీలో “తడ్కా” అనే సినిమాలో నటిస్తున్నాను. అది కాకుండా తమిళంలో “నరగాసురన్”, తెలుగులో “వీరభోగవసంతరాయులు”. అలాగే మా “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమాటోగ్రాఫర్ బాబా దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశాను. అవన్నీ ఈ ఏడాదే విడుదలవుతాయి. సో, 2018 నా బెస్ట్ ఇయర్.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus