సుదీర్ఘ కెరీర్‌ను పూర్తిచేసుకున్న శ్రియ నేటికీ నటన పట్ల మక్కువను ప్రదర్శిస్తూనే ఉంది. కొందరు నాయికల కోవలో పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం వంటి ఏ భాషల సినిమాలలో అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
కొందరు కథానాయికలు మహిళా ప్రాధాన్య చిత్రాల ద్వారా ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్న నేపథ్యంలో తాను కూడా అలాంటి గుర్తింపును సంపాదించుకోవాలని ఆమె భావిస్తోందట. తెలుగులో గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్, గాయత్రి, వీరభోగ వసంతరాయలు తదితర చిత్రాల తర్వాత ఎన్.టి.ఆర్. కథానాయకుడు చిత్రంలో ప్రభ పాత్రలో సందడి చేసిన ఆమె ఇప్పుడు మహిళా ప్రాధాన్య కథాంశంతో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
గౌతమీపుత్ర శాతకర్ణి, గోపాల గోపాల చిత్రాల్లో తల్లిగా కూడా మెప్పించిన ఆమె తాజాగా నటించబోయే మహిళా ప్రాధాన్య చిత్రంలో కూడా తల్లి పాత్రలో అభినయించబోతోందట. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న చంద్రశేఖర్ యేలేటి వినిపించిన కథ నచ్చి, శ్రియ ఈ తాజా చిత్రాన్ని అంగీకరించినట్లు సమాచారం. నితిన్ కథానాయకుడిగా చేయబోయే చిత్రానికంటే ముందుగా శ్రియ సినిమా పట్టాలెక్కనున్నట్లు పరిశ్రమలో అనుకుంటున్నారు.