బిల్లా చిత్రంలో “బొమ్మాళి నిన్ను వదల వదల” పాట ద్వారా ఫేమస్ అయిన గాయకుడు హేమచంద్ర తండ్రి అయ్యారు. తన భార్య, గాయని శ్రావణ భార్గవి ఈ రోజు పాపాయికి జన్మనిచ్చింది. వీరిద్దరూ ప్రేమించుకుని 2013 లో ప్రేమికుల రోజున పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
అప్పటి నుంచి సినిమా పాటలు పాడుతూనే, మాటీవీ, ఈటీవీ ఛానళ్లలోని సంగీత కార్యక్రమాల్లో హోస్ట్ గా వ్యహరించేవారు. గత ఏడాది ప్రెగ్నెంట్ కావడంతో శ్రావణ భార్గవి ప్రొఫిషనల్ లైఫ్ కి కొంత దూరమయ్యారు. హేమచంద్ర మాత్రం షోలలో పాల్గొనేవారు. శనివారం పాప పుట్టడంతో ఆ విషయాన్ని తమ అభిమానులతో పంచుకున్నారు.
భార్య శ్రావణ భార్గవి, పాపాయితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి .. ‘మాకు పాప పుట్టింది.. ఇప్పుడు నేను ఇద్దరు అమ్మాయిల్ని జాగ్రత్తగా చూసుకోవాలి..’ అని చెప్పారు. ఈ దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.