Shreya Ghoshal: దుర్మార్గులకు శిక్ష పడాలని.. తన పాటతో చైతన్యం తెచ్చిన శ్రేయా ఘోషల్‌..!

  • October 22, 2024 / 05:53 PM IST

ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్‌ (Shreya Ghoshal) తన గాత్రంతో అలరించడమే కాదు.. తన ఆలోచనలతోనూ సమాజాన్ని ప్రభావితం చేయగలరు. గతంలో చాలా సందర్భంలో సమాజంలో జరిగే అంశాల మీద ఆమె స్పందించారు. తనదైన శైలిలో నిరసన తెలిపారు. తాజాగా ఆమె పశ్చిమ బెంగాల్‌లో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో ఓ కాన్సర్ట్‌ నిర్వహించారు. ఇప్పటికే ఓసారి తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకున్న శ్రేయ ఘోషల్‌.. ఇప్పుడు ‘ఆల్‌ హార్ట్స్‌ టూర్‌’లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Shreya Ghoshal

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్‌ జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఓ భావోద్వేగ గీతాన్ని ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే ఆమె చెప్పిన విషయాలు కూడా. గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు.. అనే అర్థం వచ్చేలా పాటను ఉద్వేగభరింతగా ఆలపించారు. బాధితుల కష్టం, వారి ఆవేదనను పాట రూపంలో వినిపించారు. అయితే ఆ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని.. ఆమె కాన్సర్ట్‌కు హాజరైన ఆడియన్స్‌ను కోరారు.

ఈ క్రమంలో స్టేడియం మొత్తం ‘వీ వాంట్‌ జస్టిస్‌’ అనే నినాదాలతో హోరెత్తింది. మరోవైపు శ్రేయ కాన్సర్ట్‌కు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు కూడా ఈ ప్రశంసలు కురిపించినవారిలో ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రముఖ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ఓ బెంగాలీ పాటతో తన మద్దతును తెలిపారు. న్యాయం కోసం ఆవేదనతో ఈ పాట పాడుతున్నాను. మౌనంగా బాధపడుతున్న అసంఖ్యాక మహిళల కోసం, మార్పును కోరుకునే వారి కోసం ఈ గీతం అని చెప్పుకొచ్చారాయన.

మరోవైపు ఆర్‌జీ కర్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనలో న్యాయం చేకూర్చాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్‌ వైద్యులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే జూనియర్‌ వైద్యులు తమ దీక్షను వీడాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోరారు. వైద్యారోగ్య సేవలపై దీక్ష ప్రభావం పడకూడదని ఆమె అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus