సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు పాటలు రాసే వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. కేవలం సినిమా రిలీజ్ టైమ్ లో ఇచ్చే డబ్బులే వాళ్ళకు దిక్కు. వయసు మళ్ళాక అవకాశాలు లేక ఎంతో మంది పేదరికంలో మగ్గిపోయేవారు. కానీ దివంగత లెజెండరీ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. రచయితల భవిష్యత్తు కోసం ఆయన చేసిన పోరాటం గురించి చంద్రబోస్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
సీతారామశాస్త్రి గారు తన ఆరోగ్యం బాగోకపోయినా సరే దాదాపు ఆరు నెలల పాటు లా బుక్స్ చదివారట. లాయర్లతో మాట్లాడి.. నిర్మాతలతో గొడవపడి మరీ IPRS (ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ) ద్వారా రచయితలకు రాయల్టీ హక్కులు సాధించి పెట్టారు. ఆయన చేసిన ఆ యుద్ధం వల్లే ఇప్పుడున్న రైటర్లందరికీ లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తోంది. అసలు ఈ రాయల్టీ అంటే ఏంటంటే.. ఒక పాట టీవీ, రేడియో, హోటల్స్ లేదా ఫంక్షన్లలో ప్లే అయిన ప్రతిసారి దానికి కొంత మనీ వస్తుంది.
అలా వచ్చిన దాంట్లో 25 పైసలు రచయితకు.. ఇంకో 25 పైసలు మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్తాయి. మిగిలిన 50 పైసలు ఆడియో కంపెనీకి చేరుతాయి. ఇది ఒక రకంగా రచయితలకు పెన్షన్ లాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి చంద్రబోస్ ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ చెప్పారు. ‘ఆవారా’ సినిమాలోని ‘చిరు చిరు చినుకై..’ పాటకు అప్పట్లో ఆయనకు ఇచ్చింది కేవలం 25 వేల రూపాయలేనట. కానీ ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో రాయల్టీ రూపంలో ఇప్పటి వరకు ఆయనకు ఏకంగా 10 లక్షల రూపాయల వరకు వచ్చాయని చెప్పారు.
అంటే ఒరిజినల్ రెమ్యునరేషన్ కంటే రాయల్టీనే చాలా రెట్లు ఎక్కువన్నమాట. కేవలం రైటర్లకే కాకుండా సింగర్స్ కి కూడా ఇప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ అందుతున్నాయి. పాట బతికున్నంత కాలం ఆ మనీ వస్తూనే ఉంటుంది. ఆనాడు సిరివెన్నెల గారు కన్న కల ఈరోజు నిజమై ఎంతో మంది కళాకారుల కుటుంబాలను ఆదుకుంటోంది. స్టార్ స్టేటస్ ఉన్నా లేకపోయినా ఆ పాటల చలవతో రచయితలు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు.
