2022లో విడుదలైన “సిసు” అనే సినిమా రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. ర్యాండమ్ గా సినిమా చూసిన చాలామంది యాక్షన్ సీక్వెన్సులకి షాక్ అయ్యారు. స్వీడిష్ సినిమా అయిన “సిసు” ఇంగ్లీష్ డబ్బింగ్ రూపంలో పలు భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది. 6 మిలియన్ డాలర్లతో ప్రొడ్యూస్ చేయబడిన ఈ చిత్రం ఏకంగా 14 మిలియన్ డాలర్లు వసూలు చేసి చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే పనిగట్టుకుని సీక్వెల్ తీశారు. మరి ఈ సీక్వెల్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: రెండో ప్రపంచ యుద్ధంలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆటామి కోర్పి (జోర్మా) వారికి గుర్తుగా ఆ ఇంటిని నిర్మించిన చెక్క మొత్తాన్ని ప్యాక్ చేసుకొని వేరే ప్రశాంతమైన స్థలానికి వెళుతుంటాడు.
ఈ విషయం తెలుసుకున్న రెడ్ ఆర్మీ చీఫ్ ఇగోర్ (స్టీఫెన్ లాంగ్) అటామిని చంపేందుకు ఆర్మీతో సహా చిన్నపాటి యుద్ధం ప్రకటిస్తాడు.
ఆ భీకర పోరాటంలో అటామి ఎలా గెలిచి, ఇల్లు కట్టుకోవాలనే తన కల నెరవేర్చుకున్నాడు? అనేది కథాంశం.
నటీనటుల పనితీరు: సినిమా మొత్తానికి తిప్పి కొడితే పది పేజీల డైలాగ్స్ కూడా ఉండవు. దాదాపుగా యాక్షన్ తోనే నింపేశారు. అందువల్ల ఆర్టిస్టులు బాగా నటించారు అనేకంటే.. బాగా పోరాడారు అనడం సబబు.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా సినిమాకి చాలా బెటర్మెంట్ అవసరం. సినిమా టోన్ & కలరింగ్ విషయంలో కేర్ తీసుకొని ఉండాల్సింది. పోరాట సన్నివేశాలు కూడా ఇంకా ఇంటెన్స్ గా కంపోజ్ చేసి ఉండొచ్చు. సిసు ఫస్ట్ పార్ట్ కి ఆ ఇంటెన్సిటీ చాలా హెల్ప్ అయ్యింది. అలాంటిది సెకండ్ పార్ట్ లో ఆ ఇంటెన్సిటీ మిస్ అయ్యింది. అందువల్ల భీభత్సమైన యాక్షన్ బ్లాక్స్ ఉన్నప్పటికీ.. ఎందుకో సరిగా ఎంజాయ్ చేయలేం. ఎడిటింగ్, మ్యూజిక్ సరిగా సెట్ అవ్వలేదు.
ప్రాస్టెటిక్ మేకప్ టీమ్ మాత్రం తమ బెస్ట్ ఇచ్చారు. ఆ దెబ్బలు కానీ.. ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కానీ నీట్ గా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా బ్లడ్ చాలా రియలిస్టిక్ గా ఉంది. బుల్లెట్ ఫైరింగ్ సీక్వెన్సులు “రాంబో” తర్వాత ఈ సినిమాలోనే రియాలిస్టిక్ గా సెట్ అయ్యాయి. అయితే.. క్లైమాక్స్ లో వచ్చే రాకెట్ బాంబ్ సీక్వెన్స్ మాత్రం కామెడీ అయిపోయింది. మంచి మీమ్ మెటీరియల్ అవుతుంది డిజిటల్ రిలీజ్ అనంతరం. సో, దర్శకుడు క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నాడే కానీ.. సరైన విధంగా సినిమాని మలచలేకపోయాడు.
విశ్లేషణ: ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు కాబట్టి.. ఆ బ్లడీ యాక్షన్ కు షాక్ అయ్యి బాగా ఎంజాయ్ చేసారు. కానీ.. సెకండ్ పార్ట్ రిలీజ్ టైమ్ కి ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ మీటర్ సెట్ అయ్యింది. దాన్ని అందుకోవడంలో టీమ్ ఫెయిల్ అయ్యారు. లాజిక్స్ అవసరం లేకపోయినా.. ఇంటెన్స్ గా అయినా ఉండాలి కదా. అవేమీ లేకుండా జనాలు నవ్వుకునేలా ఉండడం అనేది సినిమాకి మెయిన్ మైనస్.
ఫోకస్ పాయింట్: హింస ఎక్కువ.. కంటెంట్ తక్కువ!
రేటింగ్: 1.5/5