ఈ మధ్య ఓ అగ్ర హీరో సినిమా వస్తోంది అన్నా, వచ్చింది అన్నా రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లోకి వచ్చేస్తుందా అనే ప్రశ్న మొదలైంది. అయితే పాన్ ఇండియా లెవల్‌లో విడుదలయ్యే సినిమాలకే ఈ మాట వినిపిస్తోంది. ఈ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఇటీవల కాలంలో ఎక్కువగా తెలుగు సినిమాలే వస్తున్నాయి. దీని వెనుక కారణమేంటి? ఎందుకు అనే విషయంలో రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్ ఆసక్తికర కామెంట్ చేశారు. దీంతో టాలీవుడ్ గొప్పతనం, కోలీవుడ్ ఎక్కడ వెనుకబడింది అనే అంశం తెలిసొచ్చాయి.
శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. టాలీవుడ్‌లోకంటెంట్ బాగుంటే నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడరని అన్నారు. నిర్మాత ప్రసాద్ గురించి చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు శివ కార్తికేయన్. అందుకే తెలుగు సినిమాలు అందుకే తరచూ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి అని తేల్చేశారు శివ.
చిరంజీవి, మహేశ్ బాబు లాంటి స్టార్స్ హీరోలను డైరెక్ట్ చేసిన మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉంది అని శివ కార్తికేయన్ చెప్పారు. ఇండస్ట్రీకి రావడానికి రజనీకాంత్ స్ఫూర్తి అని చెప్పిన ఆయన.. కాలేజీలో ఉన్నప్పటి నుండి మిమిక్రీ చేసేవాడినని తెలిపారు. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అని అడిగితే మా నాన్నలాగా పోలీస్ అయ్యేవాడిని అని చెప్పాడు శివ కార్తికేయన్. తన స్నేహితులు మొదటినుంచి ప్రోత్సహించారని, ఉన్నతస్థానాలకు వెళ్తానని నమ్మారని, భార్య ఆర్తి కూడా తనను ఎంతగానో నమ్మిందని చెప్పారు.
సినిమాల్లోకి రాకముందే ఆర్తి నన్ను నమ్మి పెళ్లి చేసుకుంది. అప్పట్లో నాకు మంచి శాలరీ కూడా లేదు. అయినా నాపై నమ్మకంతో నావెంటే నడిచింది. ఆమె నా జీవితంలోకి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది అని శివ చెప్పాడు.