‘కల్కి 2’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఓవైపు ఈ సినిమా గురించి ప్రభాస్ నుండి ఎలాంటి సమాచారం రావడం లేదు. మరోవైపు ఇంకో హీరోతో సినిమా చేయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ అలియాస్ నాగీ ఆలోచన చేస్తున్నారని వార్తలు రావడమే. త్వరలో సినిమా అనౌన్స్ అవుతుంది, నాగీ కొత్త సినిమా ఏంటో తేలిపోతుంది అంటూ కొన్ని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ‘కల్కి 2’ గురించి దర్శకుడు చేసిన కామెంట్లు వింటుంటే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వస్తుందా అనే డౌట్స్ వస్తున్నాయి.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. గతేడాది వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ విజయం అందుకుంది. దీనికి సీక్వెల్ ఉన్నట్లు సినిమా ఆఖరులో చిత్రబృందం వెల్లడించింది. రెండో పార్ట్ కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయిందని ఆ సినిమా ప్రచారం సమయంలో టీమ్ చెప్పింది కూడా. దీంతో మిగతా షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు. రిలీజ్ ఎప్పుడు చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.
‘కల్కి 2’ షూటింగ్ చాలా అంశాలతో ముడిపడి ఉంది. ఆ సినిమాలో నటించాల్సిన నటీనటులందరికీ కాంబినేషన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వారందరికీ కుదిరినప్పుడే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం. అందుకే ఈ సినిమా రిలీజ్‌పై కచ్చితమైన సమాధానం లేదు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాం. షూటింగ్‌కు తక్కువ సమయం పట్టేటప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రెండు సంవత్సరాల్లో సినిమా వచ్చే అవకాశం ఉంది అని అన్నారు నాగీ.
అంటే ఆయన చెప్పినట్లు సినిమా షూటింగ్ మొదలైతే 2028లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ సినిమాల లైనప్, ఆయన వ్యక్తిగత విషయాల నేపథ్యంలో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తవ్వడం అంత ఈజీ కాదు. చూద్దాం మరి నాగీ ఎలా ప్లాన్ చేస్తారో? ఎప్పుడు సినిమా తెస్తారో?