కోలీవుడ్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రం రూపుదిద్దుకోబోతోంది. మనది కానప్పటికీ ఇప్పటికే మనం అలాంటి సినిమా ఒకటి చూశాం కూడా. అలాంటి అంటే ఆ కాన్సెప్ట్‌లో సినిమా కాదు.. దానికి దగ్గరగా ఉండే సినిమా. అదే ‘2018’. మలయాళంలో తెరకెక్కి భారీ వసూళ్లు, అవార్డులు – రివార్డులు అందుకున్న సినిమా ఇది. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని తమిళంలో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. ‘అమరన్’తో (Amaran) దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసుల్ని గెల్చుకున్నాడు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan).
ఈ క్రమంలో తన 25వ సినిమాను ప్రకటించాడు. సుధా కొంగర దర్శకత్వంలో జయం రవి (Jayam Ravi), అథర్వ (Atharvaa) ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ యువ కథానాయిక శ్రీలీల (Sreeleela) తమిళంలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. శివ కార్తికేయన్ సినిమాకు ‘1965’ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం వ్తోంది. టొవినో థామస్ (Tovino Thomas) ‘2018’ సినిమా స్ఫూర్తితో ఈ ‘1965’ సినిమా ఉంటుంది అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ సమయంలో తమిళనాడులో ఏం జరిగింది, ఇప్పుడు సుధ కొంగర (Sudha Kongara Prasad) ఏం చూపించబోతున్నారు అనే చర్చ మొదలైంది. తమిళనాడు చరిత్ర చూస్తే.. 1964 సంవత్సరం ఆఖరులో తమిళనాడును ఓ తుపాను బీభత్సం సృష్టించింది. 1964 డిసెంబరు ఆఖరున రామేశ్వరం ప్రాంతాన్ని తుపాను బీభత్సం సృష్టించింది. దీనిని ధనుష్‌కొడి తుపాను అని కూడా అంటారు. ఆ సమయంలో 1800మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ తుపాను తర్వాతి సమయంలో జరిగిన విషయాల్ని ఇప్పుడు ‘1965’ సినిమాలో చూపించబోతున్నారు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విషయంలో ఫుల్ క్లారిటీ ఇస్తారట. శివ కార్తికేయన్ రీసెంట్ సినిమాలు, వసూళ్లు, విజయాల నేపథ్యంలో ఈ సినిమా తెలుగులోకి కూడా వస్తుంది అని చెప్పొచ్చు. చూద్దాం మరి ‘2018’ స్థాయిలో ఈ సినిమా విజయం అందుకుంటుందో చూడాలి.