“సినిమా బండి” చిత్రంతో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో, హిందీలో సూపర్ హిట్ సిరీస్ గా అందరి మన్ననలు అందుకున్న “పంచాయత్” సిరీస్ కి తెలుగు రీమేక్ గా రూపొందిన సిరీస్ “సివరపల్లి” (Sivarapalli). భాస్కర్ మౌర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. హిందీలో ఈ సిరీస్ చూసేసినవారికి, మొదటిసారి ఈ సిరీస్ ను చూస్తున్నవారికి ఈ సిరీస్ ఎలాంటి అనుభూతి కలిగిస్తుందో చూద్దాం..!!
కథ: తన స్నేహితులందరూ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవుతుండగా.. తనకు సివరపల్లి అనే గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఉద్యోగం రావడాన్ని ఇష్టపడకుండా, ఎప్పటికైనా అమెరికా వెళ్లాలనే ధ్యేయంతో.. ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ ఉంటాడు శ్యామ్ (రాగ్ మయూర్). సివరపల్లి సర్పంచ్ సుశీల (రూపా లక్ష్మి) అయినప్పటికీ, ఆమె భర్త సుధాకర్ (మురళీధర్ గౌడ్) అజమాయిషీ చలాయిస్తూ ఉంటాడు.
ఈ సివరపల్లిలో శ్యామ్ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? తాను కోరుకున్న జీవితానికి తిరిగి వెళ్ళగలిగాడా? అనేది “సివరపల్లి” (Sivarapalli) సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ లో చూసి తెలుసుకోవాలి.
నటీనటుల పనితీరు: రాగ్ మయూర్ ఈ రీమేక్ సిరీస్ కి తన నటనతో కొత్తదనం తీసుకొచ్చాడు. హిందీలో “పంచాయత్” సిరీస్ కి జితేంద్ర కుమార్ ఎలా ప్లస్ పాయింట్ గా నిలిచాడో, రాగ్ మయూర్ అదే స్థాయిలో తెలుగు వెర్షన్ కి మెయిన్ హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా.. మనసుకి నచ్చని పని చేసే ఓ నవతరం యువకుడిగా రాగ్ మయూర్ తన హావభావాలతో కళ్ళల్లో అలసత్వం, బాడీ లాంగ్వేజ్ లో చిన్నపాటి చిరాకు పండించాడు. చాలా మంది శ్యామ్ పాత్రకు కనెక్ట్ అవుతారు. హిందీ వెర్షన్ చూసిన ఆడియన్స్ కూడా తెలుగు వెర్షన్ ను ఆస్వాదించగలిగేలా చేసిన పెర్ఫార్మెన్స్ రాగ్ మయూర్ ది.
మురళీధర్ గౌడ్ కామెడీ టైమింగ్ ఎప్పడూ భలే ఉంటుంది. సర్పంచ్ రోల్ కి సరిగ్గా సరిపోయాడు ఆయన. అలాగే.. సుశీల పాత్రలో మొగుడు చాటు భార్యగా సగటు మహిళ పాత్రలో ఒదిగిపోయింది రూపా లక్ష్మి. పావని కరణం చివర్లో అలా మెరిసింది. ఆమె పాత్ర ఎలా ఉంటుంది, అందులో ఆమె నటన ఎలా ఉంటుంది అనేది సెకండ్ సీజన్ లో చూడాలి. ఉదయ్ గుర్రాల తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: సింజిత్ ఎర్రమల్లి సంగీతం ఈ సిరీస్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందీ సిరీస్ నుంచి కొన్ని బాణీలు అరువు తెచ్చుకున్నప్పటికీ.. కొన్ని బిట్ సాంగ్స్ & బ్యాగ్రౌండ్ స్కోర్ హృద్యంగా ఉంది. ముఖ్యంగా కామెడీ పంచ్ & ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. వాసు పెండెం సినిమాటోగ్రఫీ వర్క్ సిరీస్ కి సహజత్వం తీసుకొచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా డీసెంట్ గా ఉంది.
దర్శకుడు భాస్కర్ మౌర్య చాలా సేఫ్ గేమ్ ఆడాడు. ఆల్రెడీ అందరి మన్ననలు అందుకున్న సిరీస్ కావడంతో, ఏమాత్రం రిస్క్ చేసినా.. లేనిపోని సమస్యలు అనుకొని, చాలా జాగ్రత్తగా హిందీ వెర్షన్ ను మక్కీకి మక్కి దింపేసాడు. అయితే.. ఒక దర్శకుడిగా తన మార్క్ ని మిస్ చేయకుండా ఎమోషనల్ సీన్స్ ను బాగా రాసుకున్నాడు. నిజానికి హిందీ వెర్షన్ కంటే బెటర్ పేస్ తో స్పీడ్ గా కథనాన్ని నడిపించాడు భాస్కర్, అయితే.. సందర్భాలను కాస్త ఎక్కువగా సాగదీశాడు. అందువల్ల ల్యాగ్ అనిపించింది. ఓవరాల్ గా దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు భాస్కర్ మౌర్య.
విశ్లేషణ: ఈమధ్యకాలంలో కుటుంబం అందరూ కలిసి చూసే వెబ్ సిరీస్ లు రావడం లేదు. ఆ వెలితిని తీర్చిన సిరీస్ “సివరపల్లి”. రీమేక్ అయినప్పటికీ.. దానికంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. కథ పరంగా తెలిసిందే అయినప్పటికీ.. కథనం & నటీనటుల పెర్ఫార్మెన్సులు కచ్చితంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాగ్ మయూర్ & రూపా లక్ష్మిల నటన సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే సింజిత్ సంగీతం కూడా. సో, హిందీ వెర్షన్ “పంచాయత్” చూడని వాళ్ళందరూ హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ ను బింజ్ వాచ్ చేయొచ్చు. ఒకవేళ హిందీ వెర్షన్ చూసినవాళ్లు నటీనటుల పెర్ఫార్మెన్సుల కోసం మరోసారి ట్రై చేయవచ్చు!
ఫోకస్ పాయింట్: డీసెంట్ రీమేక్!
రేటింగ్: 3/5