Sodara Sodarimanulara Review in Telugu: సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 15, 2023 / 11:49 PM IST

Cast & Crew

  • కమల్ కామరాజు (Hero)
  • అపర్ణ దేవి (Heroine)
  • కాలకేయ ప్రభాకర్, పృథ్వీ తదితరులు (Cast)
  • రఘుపతి రెడ్డి గుండా (Director)
  • విజయ్ కుమార్ పైండ్ల (Producer)
  • వర్ధన్ (Music)
  • మోహన్ చారి (Cinematography)

వాస్తవానికి ఈ వారం ‘స్కంద’, ‘చంద్రముఖి 2’ వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని అంతా అనుకున్నారు. కానీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ‘సలార్’ పోస్ట్ పోన్ అవ్వడంతో.. ఆ డేట్ కి పోస్ట్ పోన్ అయ్యాయి ఆ సినిమాలు. దీంతో ‘మార్క్ ఆంటోనీ’ మినహా.. అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి. అలా సడన్ గా ఈ సెప్టెంబర్ 15 కి రాబోతున్న సినిమాల లిస్ట్ లో ‘సోదర సోదరీమణులారా’ అనే చిన్న సినిమా జాయిన్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

కథ: రాజు (కమల్ కామరాజు) ఓ క్యాబ్ డ్రైవర్. అతను చాలా పేదవాడు కూడా..! ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య శ్రావణి (అపర్ణాదేవి), కూతురు మహా లతో కలిసి ఉన్నదాంట్లో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఓసారి సన్నీ అనే వ్యక్తిని … ఓ లాంగ్ ట్రిప్ కి తీసుకెళ్లడానికి రెడీ అవుతాడు. అది ఊరి చివర ఉన్న ఓ రిసార్ట్. అక్కడ లేట్ నైట్ పార్టీలు జరుగుతూ ఉంటాయి.రాజు సన్నీని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న టైంలో.. ఆ రిసార్ట్ మేనేజర్.. ఓ అమ్మాయి మందు తాగి స్పృహ కోల్పోయింది. తనని ఆమె ఇంట్లో డ్రాప్ చేయమని.. ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇవ్వడంతో రాజు.. కాదనలేక ఒప్పుకుంటాడు.

కానీ సగం దూరం వచ్చి చూస్తే.. ఆ అమ్మాయికి ఊపిరి ఆడటం లేదు అనే డౌట్ అతనికి వస్తుంది. దీంతో మేనేజర్ కి ఫోన్ చేస్తే.. అతను పోలీసులకు ఫోన్ చేసి రాజుని ఇరికిస్తాడు. ఈ క్రమంలో పోలీసులు ఎంటర్ అయ్యి.. రాజు తీసుకొచ్చిన అమ్మాయి రేప్ చేయబడి చనిపోయింది అని ఆరోపణలు చేసి అతన్ని అరెస్ట్ చేస్తారు. అతన్ని స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు చేస్తుంటారు. మీడియాకి ఈ విషయం తెలిసి బాగా రచ్చ జరుగుతుంది. ఈ క్రమంలో సీఐ భాస్కర్(కాలకేయ ప్రభాకర్) రాజుని ఎన్కౌంటర్ చేయాలని డిసైడ్ అవుతాడు. మరి ఈ కేసు నుండి రాజు ఎలా బయటపడ్డాడు? అతనికి సాయం చేసింది ఎవరు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : క్యాబ్ డ్రైవర్ రాజు పాత్రలో కమల్ కామరాజు అమాయకుడిగా బాగానే సెట్ అయ్యాడు.అతని నటన కూడా బాగానే ఉంది. కానీ అతన్ని హీరోగా కాకుండా బాధితుడిగానే చూపించారు. రాజు భార్య గా చేసిన శ్రావణి (అపర్ణాదేవి) బాగానే నటించింది. సీనియర్ నటుడు పృథ్వీ కీలక పాత్ర పోషించాడు. అతని ఎక్స్ప్రెషన్స్ బాగానే ఉన్నాయి కానీ డబ్బింగ్ ఎందుకో సెట్ అవ్వలేదు అనే ఫీలింగ్ కలుగుతుంది.

సి. ఐ భాస్కర్ పాత్రలో బాహుబలి ప్రభాకర్ తనకు అలవాటైన మూర్ఖుడి పాత్రని ఎంతో ఈజ్ తో చేశాడు. కానీ ఇతని పాత్రకి సరైన ఎండింగ్ ఇవ్వలేదు. యస్. పి పాత్రలో వెంకటేశ్వర్ రావు సహజంగా నటించాడు. మిగిలిన వాళ్ళ పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు రఘుపతి రెడ్డి గుండా మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ ని తీసుకున్నాడు. కానీ దాన్ని ఎంగేజింగ్ గా చెప్పడంలో అతను సక్సెస్ కాలేదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు మలయాళంలో వచ్చిన ‘నాయట్టు’, తమిళంలో వచ్చిన ‘జై భీమ్’లోని ఆదివాసీయులను పోలీసులు చిత్రహింసలు పెట్టే ఎపిసోడ్ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల స్థాయిలో స్క్రీన్ ప్లే కనుక ఉంటే డౌట్ లేకుండా ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. కానీ క్లైమాక్స్ పోర్షన్ తీసేస్తే.. సినిమా ఫస్ట్ సీన్ నుండి ప్రతి సీన్ ముందే తెలిసిపోతూ ఉంటుంది. మోహన్ చారి కెమెరా వర్క్ ఓకే. వర్ధన్ అందించిన నేపథ్య సంగీతం పెద్దగా ఆకర్షించే విధంగా లేదు.

కొన్ని సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉండదు. పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ కూడా చాలా వీక్. అసలు ఒక సీన్ కి ఇంకో సీన్ కి సంబంధం అంటూ ఉండదు. నిర్మాణ విలువలు కూడా ఇది చిన్న సినిమా అని ప్రతి సీన్లో గుర్తు చేసే విధంగానే ఉన్నాయి తప్ప.. ఎక్కడా రిచ్ గా అనిపించవు.అసలు ఈ సినిమాకు ‘సోదర సోదరీమణులారా’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా సినిమా మొత్తం పూర్తిగా చూసినా అర్ధం కాదు. ఓవరాల్ గా ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అది రన్ టైం అనే చెప్పాలి. అవును ఈ సినిమా నిడివి.. ఒక గంట నలభై నిమిషాల లోపే..!

విశ్లేషణ : పాయింట్ బాగానే ఉన్నా.. ఎంగేజ్ చేసే విధంగా స్క్రీన్ ప్లే ఉండదు. ఓటీటీకి వచ్చాక ఒకసారి ట్రై చేయొచ్చేమో కానీ థియేటర్ కి వెళ్లి చూడదగ్గ ఆసక్తికర అంశాలు అయితే ఇందులో లేవు.

రేటింగ్ : 1.5/5

Click Here To Read in ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus