“సోలో బ్రతుకే సో బెటర్” సినిమా రివ్యూ & రేటింగ్!

మార్చిలో థియేటర్లు క్లోజ్ చేసిన తరవాత సినిమాలు ఓటీటీ వేదికల్లో రిలీజ్ అయ్యాయి. మరో మార్గం ఏదీ లేక ఓటీటీల్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయ్యాక కూడా కొంతమంది ఓటీటీల్లో రిలీజులు చేస్తున్నారు. కరోనా భయంతో ఎంతమంది థియేటర్లకు వస్తారో? ఏంటో? అనే భయంతో! ఈ సమయంలో సాయి తేజ్, ‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ ధైర్యంగా ముందడుగు వేసి థియేటర్లలో తమ సినిమా రిలీజ్ చేసింది. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అయింది. మరి, ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం


కథ:

ప్రేమ వద్దని, పెళ్లి అసలు చేసుకోవద్దని… ఒంటరి జీవితమే బావుంటుందని అని కాలేజీలో తోటి విద్యార్థులకు విరాట్ (సాయి తేజ్) నూరి పోస్తాడు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అని ఓ క్లబ్ కూడా ఏర్పాటు చేస్తాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు స్నేహితులు చెబితే వాళ్ళను దూరం పెడతాడు. అటువంటి విరాట్ ప్రేమలో ఎలా పడ్డాడు? ప్రేమ, పెళ్లి విషయాల్లో అతడి ఆలోచన-అభిప్రాయాల్లో ఎందుకు మార్పు వచ్చింది? విరాట్ వ్యక్తిత్వం, అందులో మార్పు వెనుక అతడి మావయ్య వేణు (రావు రమేష్) ప్రభావం ఎంత? అమృత (నభా నటేష్)ను విరాట్ ఎక్కడ చూశాడు? ఆమెతో ఎలా ప్రేమలో పడ్డాడు? విరాట్ రాసిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ పుస్తకంలో శ్లోకాలు చదివి ఒంటరిగా జీవించాలని నిశ్చయించుకున్న అమృతలో ఎలా మార్పు వచ్చింది? అనేది మిగతా సినిమా.

నటీనటుల పనితీరు:

‘ప్రతి రోజూ పండగే’ సినిమాతో కంపేర్ చేస్తే సాయి తేజ్ అందంగా కనిపించాడు. డ్రెస్సింగ్, లుక్ హ్యాండ్సమ్ గా ఉంది. పాత్రకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశాడు. ఎమోషనల్ సీన్ లో షైన్ అయ్యాడు. రొమాంటిక్ సీన్లలో పవన్ కల్యాణ్ టైపులో ఈజ్ తో చేశాడు. నభా నటేష్ ఎనర్జీ బావుంది. పాత్ర పరిధి తక్కువ అయినప్పటికీ తన శక్తి మేరకు చేసింది. హీరో హీరోయిన్లు కాకుండా మిగతా నటుల్లో రావు రమేష్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. నటుడిగా గతంలో ఇటువంటి పాత్రలు ఆయన చేసినప్పటికీ… తన పాత్రలో మార్పును ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. ఎమోషనల్ సీన్ లో జీవించారు. నరేష్, రాజేంద్ర ప్రసాద్ పాత్రలకు తగ్గట్టు హుందాగా నటించారు. కన్నడిగ క్యారెక్టర్ లో కామెడీ చేయడానికి వెన్నెల కిషోర్ ట్రై చేశాడు. కానీ, వర్కవుట్ కాలేదు. ‘స్వామి రారా’ సత్యను కామెడీ పరంగా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. రెండు మూడు సన్నివేశాల్లో అతడు నవ్వించాడు.


సాంకేతికవర్గం పనితీరు:

టెక్నికల్ టీమ్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ వెంకట్ సి. దిలీప్ మంచి అవుట్ పుట్ ఇచ్చాడు. రిలీజ్ కి ముందు సాంగ్స్ ఆడియన్స్ ని ఎట్ట్రాక్ట్ చేశాయి. స్క్రీన్ మీద కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. యాక్టర్స్ కూడా బాగా చేశారు. అయితే, డైరెక్టర్ చేసిన మిస్టేక్స్ వల్ల అందరి ట్యాలెంట్ బూడిదలో పోసిన పన్నీరు అయింది.

సినిమా స్టార్టింగ్ లో సోలో బ్రతుకే సో బెటర్ అని స్పీచ్ ఇస్తున్న హీరో ప్రేమలో పడతాడని, క్లైమాక్స్ కి వచ్చేసరికి పెళ్లి చేసుకుంటాడని చిన్నపిల్లాడిని అడిగినా చెప్తాడు. క్లైమాక్స్ ముందుగా ఊహించే ప్రమాదం ఉన్నప్పుడు ప్రేక్షకుడి ఊహకు అందని విధంగా కథను నడిపించాలి. లేదంటే కామెడీతో అయినా రన్ చేయాలి. కొత్త దర్శకుడు సుబ్బు రెండూ చేయలేదు. తడబడ్డాడు. కామెడీ సరిగా వర్కవుట్ అవ్వలేదు. దాంతో మధ్య మధ్యలో బోర్ కొడుతుంది. ఫస్టాఫ్ లో అయితే ఎంతసేపటికీ సినిమా ముందుకు కదలదు. ఇంటర్వెల్ దగ్గర హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ బెటర్. ముందుగా చెప్పుకున్నట్టు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసేదే.


విశ్లేషణ: సినిమా నుండి ఏమీ ఆశించకుండా థియేటర్ కి వెళితే కొంతవరకు ఎంజాయ్ చేయగలుగుతారు. పాటలు, అక్కడక్కడా నవ్వించే కామెడీ, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పర్లేదు. బాగున్నాయి. సోసోగా ఉన్న ఈ సినిమాకు ఒకసారి వెళ్ళవచ్చు.

రేటింగ్: 2/5

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus